ఆయన తెలుగుగడ్డపై జన్మించడం గర్వకారణం
పోడు భూముల విషయంలో ప్రభుత్వం వెంటనే విధివిధానాలు ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సేవాలాల్ సంచార జాతులను ఏకతాటిపైకి తీసుకొచ్చారన్నారు. ఆయన తెలుగుగడ్డపై జన్మించడం గర్వకారణమని కొనియాడారు. హైకోర్టు ఉత్తర్వులిచ్చినా గుర్రపుబోడు తండాలో గిరిజనుల భూములు లాక్కునేందుకు ప్రభుత్వం యత్నించడం దారుణమని సంజయ్ వ్యాఖ్యానించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా గిరిజనులు ఐక్యమవుతున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న 10 శాతం మంది గిరిజనులకు రిజర్వేషన్ల అమలు కావట్లేదు. రిజర్వేషన్ల పట్ల సీఎం కేసీఆర్కు చిత్తశుద్ధి లేదు. సాగర్ ఉప ఎన్నికలో గిరిజనులు టీఆర్ఎస్కు బుద్ధి చెబుతారు. తండాలను పంచాయతీలుగా చేసి నిధులు ఇవ్వట్లేదు అని విమర్శించారు.













