తెలంగాణలో ‘బతుకమ్మ చీరల’ సందడి
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పేద మహిళలకు ఉచితంగా బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభమైంది. తొలిరోజు 28 లక్షల చీరలను మహిళలకు అందజేశారు. గ్రామాలు, పురపాలక సంఘాల్లో మహిళా సంఘాలు, వార్డు కమిటీల ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ ఏడాది రూ.300 కోట్లతో 96 లక్షల చీరలను సిరిసిల్ల నేత కార్మికులతో తయారు చేయించింది.
తొలి రోజు చీరల పంపిణ సందడిగా సాగింది. మంత్రి, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు, పురపాలక చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. హైదరాబాద్‌లో మంత్రి మహమూద్ అలీ, సిరిసిల్లలో కేటీఆర్, సిద్దిపేటలో హరీశ్‌రావు, బాన్సువాడలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిర్మల్‌లో ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాద్‌లో జోగు రామన్న, వరంగల్‌లో కడియం శ్రీహరి, జడ్చర్లలో లక్ష్మారెడ్డి, హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్, హైదరాబాద్‌లో తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు, నాయిని నర్సింహారెడ్డి, సూర్యాపేటలో జగదీశ్‌రెడ్డి, మెదక్‌లో పద్మాదేవేందర్‌రెడ్డిలతో పాటు ఆప్కో మాజీ చైర్మన్ మండల శ్రీరామలు చీరల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలిరోజు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చీరల పంపిణీ జరిగిందని రాష్ట్ర చేనేత సహకార సంస్థ (టెస్కో) ఉన్నతాధికారులు తెలిపారు. ఈ నెల 25 వరకు పంపిణీ జరుగుతుందని, ప్రతి లబ్ధిదారుకు చీర అందించాలని ముఖ్యమంత్రి సూచించారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.













