ఘనంగా బతుకమ్మ సంబురాలు
తెలంగాణలో పూలపండుగ ఘనంగా ప్రారంభమైంది. ఎంగిలిపూల బతుకమ్మతో మహిళలు సంబురాలకు స్వాగతం పలికారు. రాజధాని హైదరాబాద్‌తోపాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట తదితర నగరాలు, అన్ని జిల్లాల్లో ఆనందోత్సాహాల మధ్య పండుగ జరిగింది. హన్మకొండలోని వేయిస్తంభాల ఆలయానికి నగరంలోని మహిళలు వేలాదిగా తరలివచ్చి బతుకమ్మ ఆడుతూ పాటలు పాడుతూ సందడి చేశారు. ఆలయ పరిసరాలు తీరొక్క పూలతో నిండిపోయి జాతరను తలపించాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పాలనాప్రాంగణంలో సాంస్కృతిక శాఖ నిర్వహించిన వేడుకల్లో ఉద్యోగులు పాల్గొన్నారు. కాళేశ్వరంలోనూ మొదటి రోజు బతుకమ్మ సంబరాలు అట్టహాసంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని వీధుల్లో, రాజన్న ఆలయ ఆవరణలో మహిళలు బతుకమ్మలు ఆడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో తొలిరోజు సంబురాల అనంతరం స్థానిక సద్దుల చెరువులో పెద్దఎత్తున బతుకమ్మలను నిమజ్జనం చేశారు.













