తెలంగాణలో స్కూళ్లు మళ్లీ బంద్..!?
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ముఖ్యంగా స్కూళ్లలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో కరోనా కేసులు తక్కువేనని చెప్పొచ్చు. కరోనాను కట్టడి చేయడంలో తెలంగాణ సర్కార్ బాగా పనిచేసిందనే పేరు తెచ్చుకుంది. కేసులు తగ్గుముఖం పట్టడం.. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో జనజీవనం మళ్లీ యధాస్థానానికి చేరుకుంది. స్కూళ్లు తెరుచుకున్నాయి. పార్కులు, థియేటర్లు, షాపింగ్ మాళ్లు కూడా ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు తెలంగాణలో కరోనాకు ముందు ఎలాంటి పరిస్థితి ఉందో.. అలాగే ఉంది.
కానీ కరోనా వైరస్ చాపకింద నీరులో వ్యాపిస్తూ వస్తోంది. గత వారం రోజులుగా కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. అంతేకాక.. గతవారంలో వచ్చిన సీరో సర్వే కూడా ఆశ్చర్యకర విషయాలను బయటపెట్టింది. హైదరాబాద్ లో 54శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్టు తేల్చింది. అంటే వీరందరికీ ఇప్పటికే కరోనా సోకి వెళ్లిపోయిందన్నమాట. ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని కూడా అంచనా వేస్తున్నారు. దీంతో హైదరాబాద్ నగరం హెర్డ్ ఇమ్యూనిటీకి దగ్గర్లో ఉందని నిపుణులు భావిస్తున్నారు. 80శాతం మందిలో యాంటిబాడీలు ఉంటే హెర్డ్ ఇమ్యూనిటీ సాధించినట్లు భావించవచ్చు.
అయితే ఇటీవలికాలంలో పెద్దవాళ్లతో పోల్చితే పిల్లల్లో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతోంది. స్కూళ్లు ఓపెన్ కావడంతో పిల్లలంతా బడిబాట పట్టారు. కరోనా నిబంధనలు పాటిస్తున్నా కేసులు మాత్రం నమోదవుతూనే ఉన్నాయి. అయితే వీరిలో కరోనా లక్షణాలు ఉండట్లేదు. దీంతో కరోనా వచ్చిందో లేదో కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్ష చేస్తే తప్ప వాళ్లకు కరోనా సోకిన విషయం తెలియట్లేదు.
హైదరాబాద్ లోని నాగోల్ జడ్పీ స్కూల్లో హెడ్మాస్టర్ సహా 54 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. మైనార్టీ గురుకుల స్కూల్లో 36 మందికి కరోనా సోకింది. మంచిర్యాల గర్ల్స్ హైస్కూల్ లో 28 మందికి, కామారెడ్డి కస్తూర్బా స్కూల్లో 32 మందికి వైరస్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అయితే వీరెవరికీ తీవ్రస్థాయి లక్షణాలు లేవు. దీంతో వీరందరినీ హోం ఐసోలేషన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొన్ని స్కూళ్లను మూసేశారు.
స్కూళ్లలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. స్కూళ్లు కంటిన్యూ చేయాలా.. వద్దా అనే విషయంపై రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఆయన అసెంబ్లీలో ప్రకటించారు. అనంతరం విద్యాశాఖ మంత్రితో చర్చించిన కేసీఆర్.. 1 నుంచి 8వ తరగతి వరకూ విద్యార్థులను ఎలాంటి పరీక్షలు లేకుండానే పాస్ చేయాలని ఆదేశించారు. ఇక 9, 10 తరగతులకు ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. దీంతో రేపో మాపో స్కూళ్లను మూసివేయడం ఖాయంగా కనిపిస్తోంది.













