షర్మిల పార్టీ విలీనానికి ఎందుకు బ్రేక్ పడింది..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో పార్టీలన్నీ వ్యూహప్రతివ్యూహాల్లో బిజీబిజీగా ఉంటున్నాయి. నేతలు కూడా సేఫ్ జోన్ చూసుకుంటున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావాలనే కోరికతో పార్టీ పెట్టారు వైఎస్ షర్మిల. తెలంగాణలో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అభిమానించే వాళ్లు ఎందరో ఉన్నారని.. వాళ్లంతా తనకు అండగా నిలుస్తారని ఆమె ఆశించారు. అయితే ఆమె ఆశలు నెరవేరలేదు. దీంతో ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్ధమైపోయారు. షర్మిల ఢిల్లీ వెళ్లడంతో పార్టీ విలీనం ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే విలీన ప్రక్రియక ఇంకా కొలిక్కి రాలేదు. మరికొంత సమయం పట్టేలా ఉంది.
కాంగ్రెస్ పార్టీలో షర్మిల పార్టీ విలీనానికి ఇరువైపుల నుంచి అంగీకారం లభించింది. వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో కలుపుకునేందుకు హైకమాండ్ అంగీకరించింది. దీనికి కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ మధ్యవర్తిత్వం వహించారు. షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైపోయారు. అయితే ఆమె కొన్ని షరతులు పెట్టినట్టు సమాచారం. ఆ షరతులపైనే పీటముడి నెలకొన్నట్టు పార్టీవర్గాల సమాచారం. పార్టీ విలీనం తర్వాత తాను పూర్తిగా తెలంగాణకే పరిమితం అవుతానని.. తనను ఆంధ్రా బిడ్డగా చూడొద్దని షర్మిల స్పష్టం చేశారు. పాలేరు లేదా సికింద్రాబాద్ స్థానాల్లో ఏదో ఒక దానిని తనకు కేటాయించాలని ఆమె కోరుతున్నారు.
అయితే ఈ రెండు డిమాండ్లపైనే కాంగ్రెస్ హైకమాండ్ నుంచి స్పష్టత రాలేదు. పార్టీలో చేరిన తర్వాత పార్టీ చెప్పినట్టు నడుచుకోవాల్సి ఉంటుందని హైకమాండ్ స్పష్టం చేసింది. తన వల్ల పార్టీకి ఎక్కడ ఎక్కువ లబ్ది చేకూరుతుందని భావిస్తే అక్కడ తన సేవలను వాడుకుంటామని షర్మిలకు క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. షర్మిలను తెలంగాణలో కాకుండా ఏపీలో ఎక్కువగా వాడుకోవాలని టీపీసీసీ నేతలు కోరుతున్నారు. లేదంటే రెండు రాష్ట్రాల్లో పనిచేసేలా చూడాలని హైకమాండ్ కు సూచించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని ఖతం చేసారు వైఎస్ జగన్. అలాంటిచోట షర్మిల అయితేనే పార్టీని మళ్లీ గాడిన పెట్టగలుగుతారనేది కాంగ్రెస్ నేతల మాట. అందుకే ఈ సూచన చేశారు.
అయితే షర్మిల మాత్రం ఏపీ వద్దనుకుంటోంది. ఇప్పటికే కుటుంబ విభేదాలు వీధిన పడ్డాయి. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున ఏపీలో అడుగు పెడితే అది మరింత ముదరడం ఖాయం. సోదరుడినే విభేదించాల్సి ఉంటుంది. విమర్శించాల్సి ఉంటుంది. తల్లి విజయమ్మ సూచన మేరకు ఆమె ఏపీ వద్దనుకుంటున్నారు. కానీ హైకమాండ్ మాత్రం అలా కుదరదని చెప్తున్నట్టు తెలుస్తోంది. పార్టీకోసం దేశంలో ఎక్కడికైనా వెళ్లి పని చేయాలని సూచించినట్టు సమాచారం. దీనిపై క్లారిటీ వస్తే పార్టీ విలీన ప్రక్రియ కొలిక్కి వచ్చినట్టే. బహుశా వారం పది రోజుల్లో ఇది తేలనున్నట్టు సమాచారం.













