పాలనపై ఫోకస్ పెట్టిన కేసీఆర్..! ముందస్తులో భాగమేనా..?
తెలంగాణలో మరోసారి ముందస్తు ఎన్నికలు ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. సీఎం కేసీఆర్ మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టి పారేస్తున్నా.. ఆయన చర్యలు మాత్రం ముందస్తును సూచిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. మునుగోడులో విజయం తర్వాత కేసీఆర్ ప్లాన్ మారిందని చెప్తున్నారు. కేసీఆర్ కూడా ఇప్పుడు పార్టీతో పాటు పాలనపైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అధికారులతో నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పనులపై అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. పెండింగ్ పనులను పూర్తి చేసిన వెంటనే ఎన్నికలకు వెళ్లేందుకు కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది సమ్మర్ లోనే తెలంగాణలో ఎన్నికలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇటీవలే సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జల్లా అధ్యక్షులు.. ఇలా కీలక నేతలందరూ ఈ సమావేశానికి హాజర్యయారు. ఈ సందర్భంగా కేసీఆర్ ముందస్తు ఎన్నికలపైన కూడా మాట్లాడారు. బయట చాలా మంది కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని ప్రచారం చేస్తున్నారని.. అలాంటి వాటిని పట్టించుకోవద్దని ఆయన నేతలకు సూచించారు. అయితే ఎన్నికలకు పది నెలలు కూడా సమయం లేదని.. నేతలందరూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని సూచించారు. అంతేకాక గ్రౌండ్ లెవల్లో ఏవైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. నియోజకవర్గాలవారీగా పాలనాపరంగా ఏవైనా చేయాల్సి ఉంటే.. అలాంటివాటిని కూడా తెలియజేయాలన్నారు. దీంతో అప్పుడే పలువురు నేతలు పలు అంశాలను కేసీఆర్ దృష్టికీ తీసుకెళ్లారు. ఆ మీటింగ్ మరుసటి రోజు నుంచే కేసీఆర్ పాలనపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు.
కేసీఆర్ చేపట్టిన ప్రధాన ప్రాజెక్టుల్లో సెక్రటేరియేట్ నిర్మాణం ఒకటి. దీన్ని స్వయంగా పర్యవేక్షించారు సీఎం కేసీఆర్. దీన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. వాస్తవానికి వచ్చే ఏడాది ఉగాది నాటికి దీన్ని పూర్తి చేయాలనుకున్నారు. అయితే కేసీఆర్ పర్యటన తర్వాత దీన్ని సంక్రాంతి నాటికే పూర్తి చేయాలని టార్గెట్ పెట్టినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత జరిగిన రోడ్లు, బిల్డింగుల శాఖ సమీక్షలో రాష్ట్రంలోని రోడ్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పాడైపోయిన రోడ్లను బాగుచేయడాన్ని ప్రయారిటీగా తీసుకోవాలని సూచించారు. వర్షాకాలం పూర్తయింది కాబట్టి రోడ్లపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని సూచించారు. ఒకేసారి 7 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేశారు. గత ఎన్నికలకు ముందు కంటివెలుగు పేరుతో ఓ కార్యక్రం చేపట్టారు కేసీఆర్. అది సత్ఫలితాలిచ్చింది. ఇప్పుడు కూడా వచ్చే ఏడాది జనవరిలో కంటివెలుగు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అంతేకాక.. వివిధ కాలేజీల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇంతకాలం పాలనపై పెద్దగా దృష్టి పెట్టని కేసీఆర్.. ఇప్పుడు ఫుల్ ఫోకస్ పెట్టడంతో ముందస్తు ఊహాగానాలు బలపడుతున్నాయి.
కేసీఆర్ స్ట్రాటజీలు అంత త్వరగా అర్థం కావు. తన వ్యూహాలతో ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేయడంలో సిద్ధహస్తులు. ఇప్పుడు కూడా అదే తరహా వ్యూహాన్ని అనుసరిస్తున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ ఓడిపోయింది. ఈ స్థానంపై ఆ పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇప్పడు బీజేపీని మరింత దెబ్బ కొట్టేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఫామ్ హౌజ్ డీల్స్ పై సిట్ ఏర్పాటు చేసి బీజేపీ చుట్టూ ఉచ్చు బిగించేందుకు రెడీ అయ్యారు. ఈ తతంగం నడుస్తున్న సమయంలోనే వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీని రద్దు చేసి కర్నాటకతో పాటే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. కర్నాటకతో పాటు తెలంగాణలో ఎన్నికలు వస్తే కేంద్ర బీజేపీ దృష్టంతా తెలంగాణపై కంటే కర్నాటకపైనే ఎక్కువగా ఉంటుంది. అది కూడా కేసీఆర్ వ్యూహంలో బాగం. అలా కాకుండా వచ్చే ఏడాడి డిసెంబర్ వరకూ ఆగితే ఇక్కడ బీజేపీ బలపడేందుకు అవకాశాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచో, టీఆర్ఎస్ నుంచో నేతలను లాక్కొనేందుకు వీలుంటుంది. అలాంటి అవకాశం ఇవ్వకూడదనుకుంటున్నారు కేసీఆర్. మరి చూడాలి ఆయన వ్యూహాలు ఎలా వర్కవుట్ అవుతాయో!













