టీఆర్ఎస్ కు కీలక నేత షాక్ ఇవ్వబోతున్నారా..?
కొంతమంది రాజకీయ నేతలు ఎక్కడున్నా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. వాళ్లు ఏ పార్టీలో ఉన్నారనేది సంబంధం ఉండదు. కానీ ప్రజలు వారి వెంట నడుస్తూ ఉంటారు. కాలం కలసిరాని సందర్భాల్లో కూడా వారినే తమ నేతగా భావిస్తూ ఉంటారు. అలాంటి నేతలు కూడా అధికారంలో ఉన్నా, ఓడిపోయినా నిత్యం ప్రజల్లో ఉంటూ వారే సర్వస్వంగా భావిస్తుంటారు. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ఉంటారు. అలాంటి నేతల్లో ఒకరు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నేత జూపల్లి కృష్ణారావు. ఇప్పుడాయన అధికార టీఆర్ఎస్ లో ఉండీ ఉండనట్లు ఉంటున్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో సొంత అజెండాతో ముందుకెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు.
జూపల్లి కృష్ణారావు.. మాజీ మంత్రిగా, కాంగ్రెస్ పార్టీలో మంచి నేతగా గుర్తింపు పొందారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వై.ఎస్.కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా ఆయన పాదయాత్ర చేశారు. అనంతరం ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్ర విభజన అయ్యాక 2014లో టీఆర్ఎస్ నుంచి గెలిచిన జూపల్లి కృష్ణారావు కేసీఆర్ తొలి కేబినెట్లో మంత్రి పదవి చేపట్టారు. అనంతరం 2018లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో జూపల్లి కృష్ణారావు ఓటమి పాలయ్యారు. అయినా ఆయన పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు.
2018లో కొల్లాపూర్ లో కృష్ణారావు ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన బీరం హర్షవర్ధన్ రెడ్డిని టీఆర్ఎస్ తన పార్టీలో చేర్చుకుంది. దీంతో జూపల్లి కృష్ణారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి మధ్య వైరం నెలకొంది. ఒకే పార్టీలో రెండు వర్గాలు తయారయ్యాయి. బీరం హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండడంతో అధికారయంత్రాంగమంతా ఆయన చెప్పినట్టే నడుచుకుంటోంది. దీంతో జూపల్లి కృష్ణారావు వర్గీయులు రగిలిపోతున్నారు. అంతేకాక.. తన వర్గీయులపై బీరం హర్షవర్ధన్ రెడ్డి కేసులు పెట్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని జూపల్లి కృష్ణారావు బహిరంగంగానే చెప్పారు. అంతేకాక కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గాన్ని కాపాడుకునేందుకు రెబెల్ గా తన వర్గీయులను బరిలోకి దింపారు. మొత్తం 20 వార్డుల్లో 12 వార్డులు జూపల్లి కృష్ణారావు వర్గీయులకు దక్కాయి. దీన్నిబట్టి ఆయనకు అక్కడున్న పట్టును అర్థం చేసుకోవచ్చు. అయినా టీఆర్ఎస్ అధిష్టానం తనను పెద్దగా పట్టించుకోవట్లేదనే ఆవేదన జూపల్లిలో కనిపిస్తోంది. తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వట్లేదని ఆయన భావిస్తున్నారు.
మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇంకా వెయిట్ చేస్తుంటే కేడర్ తో పాటు తనకూ అన్యాయం జరుగుతందని జూపల్లి కృష్ణారావు భావిస్తున్నారు. అందుకే ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈసారి టీఆర్ఎస్ జెండాతో కాకుండా వ్యక్తిగత అజెండాతో ముందుకెళ్తున్నారు. ఒకవేళ టీఆర్ఎస్ అధిష్టానం తనకు టికెట్ ఇస్తే పార్టీ తరపున పోటీ చేస్తారు. అలా కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి టికెట్ ఇస్తే తాను మరో పార్టీ తరపున పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ తనకు ప్రాధాన్యం ఇవ్వనప్పుడు తాను ఇంకా వెయిట్ చేస్తూ ఉండడం సరికాదనే భావనకు జూపల్లి వచ్చినట్లు ఆయన వర్గీయులు చెప్తున్నారు. అందుకే ఆత్మీయ సమ్మేళనాల తర్వాత కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం.













