వారి మెప్పు కోసమే నాపై కేసులు: రాజాసింగ్
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదైంది. అతనిపై ఉన్న పీడీయాక్ట్‌ను ఎత్తివేస్తూ హైకోర్ట్ విధించిన షరతులను ఆయన ఉల్లంఘించారని పోలీసులు తమ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఈ నెల 6న అయోధ్య రామమందిరంపై రాజాసింగ్ ఓ ట్వీట్ చేశారు. దీంతో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ రాజాసింగ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు రాజాసింగ్ తరపు న్యాయవాది సంజాయిషీ ఇచ్చారు. కానీ సంజాషియీ సంతృప్తిగా లేదంటూ సెక్షన్ 295ఏ కింద కొత్త కేసు నమోదు చేశారు. అయితే తాజాగా దీనిపై రాజాసింగ్ స్పందించారు. ఓవైసీ సోదరుల మెప్పు పొందేందుకే తనపై పోటీ పడి కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. బాబ్రీ మసీదు ఘటనపై ఓవైసీ సోదరులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు వారిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం ఓవైసీ సోదరుల మెప్పు కోసం పోలీసులు తెగ ఉబలాటపడుతున్నారని విమర్శించారు. కానీ తాను నమ్మిన హిందూ సిద్దాంతం కోసం బుల్లెట్లను ఎదుర్కొనేందుకు సిద్ధమేనని, ప్రాణం ఉన్నంత వరకు రామనామ జపం చేసుకుంటూ ఉంటానని రాజాసింగ్ చెప్పుకొచ్చారు.













