టీహబ్‌ను సందర్శించిన అమెరికా రాయబారి ఎలిజబెత్ జోన్స్
భారత్‌లో అమెరికా రాయబారి ఎలిజబెత్ జోన్స్ టీహబ్‌ను సందర్శించారు. ఆమె వెంట హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ కూడా ఉన్నారు. అనంతరం వారు మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ తెలంగాణ పారిశ్రామిక విధానాలు, మౌలిక వసతులు, వనరులు, ఇతర అంశాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎనిమిదేళ్ల స్వల్పకాలంలోనే తెలంగాణ అద్భుతాలు సాధించింది. అమెరికా సహా ఇతర దేశాలకు చెందిన ప్రసిద్ద సంస్థలు తమ రెండో ప్రాంగణాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాయి. రాష్ట్రంలో పెట్టుబడులు లాభదాయకంగా మారడంతో దేశ, విదేశీ సంస్థలు తరలివస్తున్నాయి. అమెరికా సంస్థలు ఔషధ, మైమానిక తదితర రంగాల్లో పరిశ్రమలను స్థాపించి పురోగమిస్తున్నాయి. రాష్ట్రవృద్ధికి సహకరిస్తున్నాయి. ఔషధ, బయోటెక్ రంగాలు కరోనా సమయంలో కీలకంగా వ్యవహరించి, మానవాళికి ప్రశంసనీయమైన సేవలందించాయి అని కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా జోన్స్ టీహబ్ నిర్వహణ, ఏర్పాటును ప్రశంసించారు. తెలంగాణ పారిశ్రామిక పురోగతికి ఇది నిదర్శనమని తెలిపారు. తెలంగాణ ఆర్థిక చైతన్యాన్ని టీహబ్ నిరూపిస్తోందని కాన్సుల్ జనరల్ జెన్నిపర్ తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఎలిజబెత్ జోన్స్‌ను సత్కరించారు.













