పాలన ‘ముళ్ల ‘కిరీటమేనా..?
అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీకి.. పాలనపరంగా సవాళ్లు స్వాగతం పలకనున్నాయి. ఇప్పటికే ఆర్థికంగా రాష్ట్రం సమస్యల్లో ఉండడంతో ఎన్నికల్లో హామీ ఇచ్చిన వివిధ పథకాలను అమలు చేయడం కత్తిమీద సామే కానుంది. రాష్ట్రం ఇప్పటికే రూ.5 లక్షల కోట్లకు పైగా అప్పుల్లో ఉంది. విద్యుత్తు సంస్థలు నష్టాల్లో ఉన్నాయి. రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిరర్థక ప్రాజెక్టుగా మారిందన్న ఆరోపణలున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలంటే ఏటా రూ.75 వేల కోట్లకు పైగా నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఆరు గ్యారంటీల్లో ప్రధానంగా 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ఏయే సమయంలో నోటిఫికేషన్ ఇచ్చేదీ ప్రకటించింది. దీంతో ఉద్యోగాల భర్తీ కూడా అత్యంత కీలకం కానుంది.
ఇక విద్యుత్తు సంస్థలు ఏకంగా రూ.50 వేల కోట్ల నష్టాల్లో ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లుగా ప్రతి కుటుంబానికీ 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్తు అందించాలంటే ఏటా రూ.3500 కోట్ల దాకా సబ్సిడీ రూపంలో డిస్కమ్‌లకు అందించాల్సి ఉంటుంది. ఇప్పటికే రూ.10 వేల కోట్లను సబ్సిడీ రూపంలో ఇస్తుండగా.. అదనంగా మరో రూ.3500 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక రాష్ట్రమంతటా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని కూడా అమలు చేయాల్సి ఉంది. ఈ హామీతో ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడే అవకాశం ఉన్నా.. పెరగనున్న రద్దీని తగ్గించడానికి అదనంగా వేలాది బస్సులను ఆర్టీసీకి సమకూర్చాల్సి ఉంటుంది. అయితే ఆర్టీసీ కూడా నష్టాల్లోనే ఉంది. ఇక ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు, ఉద్యోగ , ఉపాధ్యాయులకు వేతన సవరణ కూడా కీలకం కానుంది.
హైదరాబాద్‌కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ను కాపాడుకోవడం, అంతర్జాతీయ సంస్థలను ఆహ్వానించడం, పెట్టుబడులు వచ్చేలా చూసుకోవడం, శాంతిభద్రతల పరిరక్షణ రానున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అత్యంత కీలకం కానున్నాయి. హైదరాబాద్ శాంతిభద్రతలపై కేసీఆర్ దృష్టి సారించిన ఫలితంగానే ఆ పార్టీ గ్రేటర్లో బలమైన ప్రదర్శనతో సీట్లు రాబట్టిందన్న అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి శాంతిభద్రతల పరిరక్షణ కూడా ప్రధాన లక్ష్యం కావాల్సి ఉంది. ఓవైపు మజ్లిస్, మరోవైపు బీజేపీ ఇరువైపులా మోహరించి ఉండటంతో హైదరాబాద్‌తోపాటు పలు సున్నిత ప్రాంతా ల్లో శాంతిభద్రతల రక్షణ ప్రధానం కానుంది.
ధరణి వెబ్ సైట్ ను రద్దు చేస్తామన్న కాంగ్రెస్.. దాని స్థానంలో భూభారతి ప్రాజెక్టును పట్టాలపైకి ఎక్కించడం కూాడా పెద్ద పనికానుంది. వీటన్నింటికీ మించి రానున్న ఆర్నెల్లలోపు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున.. సవాళ్లను దాటుకొని ఆరు గ్యారంటీలు విధిగా, ప్రభావవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత కొత్తగా కొలువుదీరే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది.













