“ఇందిరమ్మ బీమా’తో కాంగ్రెస్ మాస్టర్ స్ట్రోక్!
తెలంగాణలో మరో కీలక హామీ అమలుకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికల సమయంలో పలు కీలక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.., అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయట్లేదనే విమర్శలు ఎదర్కొంటోంది. అలాంటి వాటిలో ఇందిరమ్మ బీమా పథకం ఒకటి. ఇప్పుడు ఈ స్కీంను అమలు చేసేందుకు సన్నద్ధమైంది. నవంబర్ 19న ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు ఇచ్చింది. వీటిని కచ్చితంగా అమలు చేస్తామని మాటిచ్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ (గృహజ్యోతి), రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని రూ. 10 లక్షలకు పెంపు వంటి వాటిని ఇప్పటికే అమలు చేస్తోంది.
ఇవి కూడా చదవండి
తాజాగా ‘ఇందిరమ్మ బీమా’ ద్వారా ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల వరకు ఉచిత బీమా కవరేజ్ కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అట్టడుగు వర్గాల కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇంటి పెద్దను కోల్పోయి ఆర్థికంగా చితికిపోతున్న కుటుంబాలకు ఈ బీమా పథకం ఒక పెద్ద దిక్కుగా మారుతుందనడంలో సందేహం లేదు. ఇందిరమ్మ బీమా పథకాన్ని నవంబర్లో ప్రారంభించడం ద్వారా, రాబోయే గ్రాడ్యుయేట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల మద్దతును మరింత సుస్థిరం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
పథకాలను అనౌన్స్ చేయడం సులభం. అయితే క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఎటువంటి అవినీతికి తావులేకుండా ఈ బీమా ఫలాలను చేరవేయడం ప్రభుత్వానికి అసలు సిసలు పరీక్ష. గతంలో ఉన్న లోపాలను సరిదిద్దుతూ, పారదర్శకమైన విధానంలో ఈ బీమాను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యారంగంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత అల్పాహారం వంటి విప్లవాత్మక మార్పులకు, ఈ బీమా పథకం కూడా తోడైతే ప్రభుత్వానికి తిరుగుండదని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.








