ఓటర్ల నమోదులో వెనకబడ్డ రాజకీయ పార్టీలు!
తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకోసం ఓటర్ల నమోదు ప్రక్రియ జరుగుతోంది. చదువుకున్న నిరుద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, ఐటీ నిపుణులు అధికంగా ఉండే రాజధాని హైదరాబాద్‌లో ఓటర్ల నమోదు ప్రక్రియ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. దీనికి విరుద్ధంగా, నల్గొండ- ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గంలో మాత్రం ఓటర్ల నమోదు ఉత్సాహంగా సాగుతోంది. నవంబర్ 6 నాటికి ఓటర్ల నమోదుకు తుది గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్ల నమోదులో విఫలమవుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కేవలం 1,91,360 దరఖాస్తులు మాత్రమే అందగా, నల్గొండ- ఖమ్మం- వరంగల్ నియోజకవర్గంలో ఏకంగా 2,44,349 దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి జిల్లాలో 53,491 దరఖాస్తులు, మేడ్చల్ లో 37,364, హైదరాబాద్ జిల్లాలో 22,535, వికారాబాద్ లో 15,020 చొప్పున నమోదయ్యాయి. ఇక రెండో నియోజకవర్గానికి వస్తే… నల్గొండలో 46,038, సూర్యాపేటలో 31,512, ఖమ్మంలో 37,848 దరఖాస్తులతో గ్రామీణ-అర్బన్ మిశ్రమ ప్రాంతాలు అగ్రస్థానంలో నిలిచాయి. 2021 ఓటర్ల జాబితాతో పోలిస్తే అప్పట్లో హైదరాబాద్ నియోజకవర్గంలో 5.31 లక్షలు, నల్గొండ నియోజకవర్గంలో 5.05 లక్షల మంది ఓటర్లు ఉండేవారు. అయితే, ప్రస్తుత గణాంకాలు కేవలం అందిన దరఖాస్తులను మాత్రమే సూచిస్తున్నాయని, ఇవి తుది ఓటర్ల జాబితా వచ్చేసరికి మారే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఓటర్ల నమోదు ప్రక్రియ మందకొడిగా సాగడానికి ప్రధాన కారణం రాజకీయ పార్టీల వైఫల్యమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. పండుగ వాతావరణం, ఇతర రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్న పార్టీలు పట్టభద్రుల నమోదుపై దృష్టి పెట్టడంలో విఫలమయ్యాయి. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు కేవలం సాధారణ ఎన్నికలు, స్థానిక సంస్థల పైనే దృష్టి సారిస్తుండటంతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాముఖ్యతను క్రింది స్థాయి క్యాడర్‌కు చేరవేయడంలో చొరవ చూపడం లేదు. హైదరాబాద్‌లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన నిపుణులు, ఐటీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ, నివాస ధృవీకరణ పత్రాలు సమర్పించడంలో ఉండే నిబంధనలు, అవగాహన లోపం ఓటర్ల నమోదును దెబ్బతీస్తున్నాయి. పార్టీల యంత్రాంగం బూత్ స్థాయి నుంచి పట్టభద్రులను మోబిలైజ్ చేయడంలో విఫలమవడం వల్లనే అర్హులైన లక్షలాది మంది ఓటు హక్కుకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది.
ఎమ్మెల్సీ ఎన్నికలు కేవలం చట్టసభల ప్రాతినిధ్యం మాత్రమే కాదు, రాబోయే రాజకీయ పరిణామాలకు ఒక రిఫరెండమ్‌గా భావిస్తారు. పట్టభద్రుల నియోజకవర్గాల్లో విజయం సాధించడం ద్వారా మేధావి వర్గం తమవెంట ఉందనే సంకేతాలను రాజకీయ పార్టీలు పంపాలనుకుంటాయి. అయితే, హైదరాబాద్ వంటి ప్రతిష్టాత్మక నియోజకవర్గంలో ఓటర్ల నమోదు పట్ల చూపుతున్న నిర్లక్ష్యం ఆయా పార్టీల బలాన్ని బలహీనపరిచే అవకాశం ఉంది. రానున్న కొద్ది రోజుల్లో పార్టీలు తమ వ్యూహాలను మార్చుకుని, అర్హులైన పట్టభద్రులతో దరఖాస్తులు పూర్తి చేయించడంలో ఎంతవరకు సఫలమవుతాయనే అంశంపైనే ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. గడువు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు మేలుకుని క్రియాశీలక పాత్ర పోషిస్తాయా లేదా అనేది వేచి చూడాలి.








