ప్రవాసులు గ్రామాలను దత్తత తీసుకోవాలి : కోడెల
ప్రవాసాంధ్రులు తమ స్వగ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధికి కృషిచేయాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కోరారు. సింగపూర్లో స్థిరపడ్డ తెలుగువారు ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు సహకరించాలని, ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. సింగపూర్ ఐటీ కంపెనీల్లో సిర్థపడిన తెలుగువారు వారి వారి గ్రామాల్లో కనీసం ఒక్కరికైనా ఉపాధి కల్పించాలని గ్రామాల్లో సృజనాత్మకత పెంపొందించి గ్రామా అభివృద్ధికి కొత్త ఆలోచనలు ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన తెలుగువారు స్పీకర్ చేపట్టిన, చేపడుతున్న వన మహోత్సవం, అవయవదానం, మరుగుదొడ్ల నిర్మాణం, నీటి సంరక్షణకు చేపడుతున్న కార్యక్రమాలను కొనియాడారు. సింగపూర్ తెలుగు సంఘం కోడెలను సత్కరించింది.













