ఆర్బీఐ గవర్నర్ రాజీనామా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ పదవికి ఊర్జిత్ పటేల్ రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నారా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానాలు అనేకం వినిపిస్తున్నాయి. స్వయంప్రతిపత్తి, ద్రవ్యవిధానాల్లో స్వేచ్ఛపై ప్రభుత్వ పెద్దలతో నెలకొన్న విభేదాలూ వీటిని బలపరుస్తున్నాయి. మొన్న ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య వ్యాఖ్యలు, నిన్న సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం అభ్యంతరాలు, తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ విమర్శలు. ఆర్బీఐ, కేంద్రం మధ్య వివాదాన్ని ఒక్కసారిగా వేడెక్కించాయి. ఈ నేపథ్యంలో పటేల్ రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. ఫారెక్స్, బాండ్ మార్కెట్లలో ఈ వార్తలు ప్రకంపనల్నీ సృష్టించాయి. మరోవైపు నవంబర్ 19న జరిగే ఆర్బీఐ బోర్డు సమావేశం తర్వాత తన గవర్నర్ హోదాకు పటేల్ గుడ్‌బై చెప్పే అవకాశాలున్నాయని తెలుస్తున్నది.













