ఆర్బీఐకి విరాల్ గుడ్‌బై
భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య రాజీనామా చేశారు. పదవీ కాలం ముగియడానికి మరో 6 నెలలు ముదే ఆర్బీఐకి గుడ్‌బై చెప్పడం పలు సందేహాలకు తావిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ మాత్రం వ్యక్తిగత కారణాల వల్ల కొద్ది వారాల క్రితం ఆచార్య రాజీనామా సమర్పించారని చెబుతోంది. వచ్చే నెల 23 తర్వాత సేవలందించలేనని లేఖలో పేర్కొన్నట్లు వెల్లడించింది. ఆయన రాజీనామా పరిగణనలో ఉందని విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. కొద్ది వారాల క్రితమే విరాల్ రాజీనామా సమర్పించినప్పటికీ.. ఇందుకు సంబంధించి మీడియాలో కథనాలు రావడంతో ఆర్బీఐ బయటికి వెల్లడించక తప్పలేదు. డిప్యూటీ గవర్నర్ బాధ్యతల నుంచి తప్పుకున్నాక ఆచార్య తిరిగి అధ్యాపక వృత్తిని చేపట్టనున్నారు. న్యూయార్క్ విశ్వవిద్యాలయంలోని స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌గా మళ్లీ బాధ్యతలు స్వీకరించనున్నార. ఆర్బీఐ పదవిని చేపట్టకముందు ఆయన అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ప్రస్తుతం దీర్ఘకాలిక సెలవుపై ఉన్నారు.













