ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతాం
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని కాంగ్రెస్ పార్టీ మరోసారి సృష్టం చేసింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రారంభమైన 84వ ఏఐసీసీ ప్లీనరీ రాజకీయ తీర్మానంలో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చారు. కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావనను తీసుకువచ్చారు. ఇప్పటి వరకు ఏపీకి హోదా ఇవ్వకపోవడాన్ని కాంగ్రెస్ ఖండించింది. ఏపీ విభజన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చిందని బీజేపీ సహా అన్ని పార్టీలు ఒప్పుకున్నాయని కాంగ్రెస్ గుర్తు చేసింది. ఏపీకి ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నామని సృష్టం చేసింది. ప్రస్తుత విభజన చట్టంలోని హామీలను ఎన్డీఏ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించింది. తాము అధికారంలోకి వచ్చాక హోదా ఇవ్వడంతో పాటు విభజన హామీలు తప్పనిసరిగా అమలు చేస్తామని కాంగ్రెస్ తీర్మానం చేసింది.













