దేశ అభివృద్ది కోసం ప్రతి ఒక్కరం పనిచేయాలి : ప్రధాని
వచ్చే ఐదేళ్లలో 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ గల దేశంగా భారత్‌ను వృద్ధిలోకి తీసుకురావాలనే లక్ష్యం సవాలేనని, అయితే సమిష్టి కృషితో ఆ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నీతి ఆయోగ్ పాలక మండలి ఐదో సమావేశం రాష్ట్రపతి భవన్లో జరిగింది. ఈ సమావేశంలో ప్రసంగించిన మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దిశానిర్దేశం చేశారు. సబ్కా సాథ్, సబ్ కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదాన్ని ఆచరణలో పెట్టడంతో నీతి ఆయోగ్ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఎన్నికల సమరం పూర్తయ్యిందని, ఇక దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. జీడీపీ వృద్ధి కోసం జిల్లా స్థాయి నుంచే కార్యచరణ చేపట్టాలన్నారు. పేదరికం, నిరుద్యోగం, కరవు, వరదలు, కాలుష్యం, అవినీతి, హింసపై సమష్టిగా పోరాడాలన్నారు.
నీటి ఎద్దడిని తీర్చేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని అన్నారు. నీటి సంరక్షణ, నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కొత్తగా ఏర్పాటుచేసిన జల్‌శక్తి మంత్రిత్వశాఖ రాష్ట్రాలకు అవసరమైన సాయం చేస్తుందన్నారు. ఆదాయ పెంపుదల, ఉపాధి కల్పనలో ఎగుమతి రంగానికే ముఖ్య పాత్ర అని, ఎగుమతి రంగాన్ని ప్రోత్సహించడంపై రాష్ట్రాలు దృష్టి సారించాలని సూచించారు. పారదర్శక పాలన వల్లే చిట్టచివరి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందుతాయని అన్నారు.













