ఇంట్లో పురుగు మందుతో ఏడాది ముప్పు
వర్షాకాలం వచ్చేసింది. ఈగలు దోమలతో పాటు రకరకాల పురుగులు చొరవగా ఇంట్లోకి వచ్చేస్తుంటాయి. ఈ పిలవని అతిథులను సాగనంపేందుకు మార్కెట్లోని దొరికే స్ప్రేలను ఉపయోగించడం మామూలే. ఈ స్పే ప్రభావం ఏకంగా ఏడాదిపాటు అలాగే ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పొలాల్లో వాడే పురుగు మందులకు ఈ రసాయనాలు ఏమీ తీసిపోవని, సుదీర్ఘకాలంపాటు వీటి ప్రభావానికి గురైతే అనారోగ్యాల బారిన పడక తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ స్ప్రేలలోని పైరెథాయిడ్లు, కర్టెన్లు, ఫ్లోర్పైన, సోఫాలు కుర్చీలపైనా పేరుకుపోయి చాలా కాలంపాటు నిల్వ ఉంటాయని తెలిపారు. సదరు రసాయనాలు విచ్ఛిన్నం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇంట్లో గదులన్నీ చక్కపెట్టేసే చిన్నారి పాపాయిలు, పెంపుడు జంతువులపై వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. చెద పురుగుల నివారణకు ఉపయోగించే మందులతోనూ ఇదే రకమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.













