వైఎస్ వివేకానందరెడ్డి ఇకలేరు
వైఎస్ రాజశేఖర్రెడ్డి సోదరుడు, జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి (68) హఠాన్మరణం చెందారు. పులివెందులలోని ఆయన నివాసంలో శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం పులివెందుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 1950 ఆగస్టు 8న పులివెందులలో వివేకానందరెడ్డి జన్మించారు. తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో డిగ్రీ చదివారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి చిన్నతమ్ముడైన వివేకకు భార్య సౌభాగ్య, కుమార్తె సునీత ఉన్నారు. కడప లోక్సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు (1999,2004) ఎన్నికయ్యారు. పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా రెండుసార్లు (1989 1994) సేవలందించారు. 2009లో సెప్టెంబర్లో ఉమ్మడి ఏపీలో మండలి సభ్యుడిగానూ పనిచేశారు. 2010లో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ విజయమ్మపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం కడప జిల్లాతో పాటు, వైఎస్ఆర్ కుటుంబం, అభిమానుల్లో విషాద ఛాయలు నింపింది.
సీఎం చంద్రబాబు సంతాపం :
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రిగా, ప్రజా ప్రతినిధిగా వైఎస్ వివేకా అనేక మంది అభిమానం పొందారని గుర్తు చేశారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా దీర్ఘకాలం సేవలందించారని కొనియాడారు. వైఎస్ వివేకానందరెడ్డి ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నట్లు తెలిపారు.













