హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై వై.ఎస్.షర్మిల సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ లో హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు దుమారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వైసీపీలో కూడా కొందరు పేరు మార్చడం సరికాదన్నారు. నందమూరి ఫ్యామిలీలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానులు నిరనస తెలుపుతుంటే.. వైసీపీ శ్రేణులు మాత్రం తమ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థించుకుంటున్నాయి. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ కంటే వైయస్సార్ పేరు ఉండడమే సముచితమని వాదిస్తున్నాయి.
ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టడంపై ఎవరి వాదన వాళ్లు వినిపిస్తున్నారు. వైసీపీ సమర్థించుకుంటుంటే టీడీపీ ఆగ్రహంతో ఉంది. అయితే సీఎం జగన్ సోదరి వై.ఎస్.షర్మిల పేరు మార్పుపై కీలక ప్రకటన చేశారు. పేరు మార్పును ఆమె వ్యతిరేకించారు. ఇది జగన్ కు కాస్త ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించారు. జగన్ చెల్లెలు కూడా పేరు మార్పును సమర్థించలేదని.. కనీసం చెల్లెలి మాటయినా వినాలని జగన్ కు సూచించారు.
హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై స్పందించిన షర్మిల కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. తన తండ్రి వై.ఎస్.ఆర్. తనను ప్రేమించనంతగా ఎవరినీ ప్రేమించలేదన్నారు షర్మిల. అలాగే తాను కూడా ఈ ప్రపంచంలో ఎవరినీ తండ్రిని ఆరాధించినంతగా ఆరాధించలేదని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కు ఉన్న ఖ్యాతి ప్రపంచంలో మరెవరికీ లేదన్నారు. ఆయన చనిపోతే రాష్ట్రవ్యాప్తంగా 700 మంది ప్రాణాలొదిలారని గుర్తు చేశారు షర్మిల.
ఇదే సమయంలో షర్మిల చేసిన కొన్ని కామెంట్సీ సంచలనం కలిగిస్తున్నాయి. ఇప్పుడు ఒక ప్రభుత్వం పెట్టిన పేరును రేపు మరో ప్రభుత్వం తొలగిస్తే అది అవమానించినట్లే కదా.. అని షర్మిల ప్రశ్నించారు. ఇప్పుడు వై.ఎస్.ఆర్. పేరును రేపు మరో ప్రభుత్వం తొలగిస్తే అది ఆ పెద్ద మనిషికి, ఆ పెద్ద మనిషిని ఆరాధించే ప్రజలకు అవమానం కాదా అని షర్మిల అడిగారు. ఒకరి ఖ్యాతిని తీసుకుని వైఎస్సార్ గారికి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు షర్మిల. మరి షర్మిల కామెంట్స్ పై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.













