YS Jagan: జగన్ పర్యటనలో డా.సుధాకర్ ఫ్లెక్సీల కలకలం

వైసీపీ (YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి (YS Jagan ) ఇవాళ నర్సీపట్నంలో (Narsipatnam) పర్యటిస్తున్నారు. తన హయాంలో మంజూరై నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ (Medical Colleges) భవనాలను సందర్శించేందుకు ఆయన వెళ్లారు. అయితే జగన్ పర్యటనపై ఆద్యంతం ఆసక్తి, ఉత్కంఠ నెలకొన్నాయి. జగన్ పర్యటన నేపథ్యంలో డాక్టర్ సుధాకర్ (Dr. Sudhakar) అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆయన ఫోటోతో ఫ్లెక్సీలు (Flexy) వెలిశాయి. మరోవైపు దళిత సంఘాలు జగన్ కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాయి. అయినా జగన్ పర్యటన మాత్రం కోలాహలంగా సాగింది.
జగన్ పర్యటన సందర్భంగా నర్సీపట్నంతోపాటు ఆయన పర్యటించే మార్గాల్లో రాత్రికి రాత్రే డాక్టర్ సుధాకర్ ఫొటోలతో కూడిన భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ఫ్లెక్సీలలోని సందేశాలు గత వైసీపీ ప్రభుత్వంపైన, జగన్‌పైన విమర్శలకు దారితీశాయి. మాస్కు ఇవ్వలేక హత్యలు చేసినవాళ్లు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడటమా? ప్రజలూ.. తస్మాత్ జాగ్రత్త అనే నినాదాలు అందులో ఉన్నాయి. కోవిడ్-19 సమయంలో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో అనస్థీషియన్‌గా పనిచేసిన డాక్టర్ సుధాకర్ వైద్య సిబ్బందికి మాస్కులు, పీపీఈ కిట్ల కొరత గురించి ప్రభుత్వాన్ని విమర్శించారు. దీని కారణంగా ఆయన సస్పెన్షన్, ఆ తరువాత జరిగిన సంఘటనలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. సుధాకర్ మృతికి వైసీపీ ప్రభుత్వ వేధింపులే కారణమని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు జగన్ మెడికల్ కాలేజీలను సందర్శిస్తుండటంతో, గతంలో మాస్కు ఇవ్వలేని వారు వైద్య విద్య గురించి మాట్లాడటం ఏంటని దళిత సంఘాలు ఈ ఫ్లెక్సీల ద్వారా ప్రశ్నించాయి.
డాక్టర్ సుధాకర్ అంశాన్ని తెరపైకి తీసుకువస్తూ, పలు దళిత సంఘాల ఆధ్వర్యంలో నర్సీపట్నంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. దళిత సంఘాల నాయకులు నర్సీపట్నంలో మానవహారం నిర్వహించి, జగన్ పర్యటనను నిరసించారు. డాక్టర్ సుధాకర్‌కు న్యాయం చేయాలని, ఆయన మృతిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కోరాయి. ఈ విషయంలో జగన్ బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. మరికొన్ని చోట్ల గో బ్యాక్ జగన్ అంటూ కూడా నినాదాలు వినిపించాయి. అయితే, ఈ ఆరోపణలను వైసీపీ నాయకులు ఖండించారు. ఇది రాజకీయ కుట్రలో భాగమేనని కొట్టిపారేశారు.
జగన్ ఈ పర్యటనలో భాగంగా మాకవరపాలెం వద్ద నిర్మిస్తున్న మెడికల్ కళాశాల నిర్మాణ పనులను పరిశీలించారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు పాల్పడుతోందని ఆరోపిస్తూ, దాన్ని నిరసించేందుకు ఆయన ఈ పర్యటనను చేపట్టారు. తొలుత జగన్ పర్యటనకు అనుమతి విషయంలో కొంత హంగామా జరిగింది. చివరకు పోలీసులు పలు షరతులతో అనుమతి ఇచ్చారు. జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. 108 అంబులెన్స్ కూడా నిలిచిపోయినట్లు వార్తలు వచ్చాయి. రహదారులపై గుమిగూడి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని జిల్లా ఎస్పీ వైసీపీ పార్టీ కార్యకర్తలను కోరారు.
మొత్తంగా, వై.ఎస్.జగన్ నర్సీపట్నం పర్యటన వైద్య కళాశాల సందర్శనతో పాటు, డాక్టర్ సుధాకర్ ఉదంతం, దళిత సంఘాల నిరసన, ట్రాఫిక్ ఇబ్బందుల కారణంగా రాజకీయంగా, స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు, చర్చకు దారితీసింది.