YS Jagan: భారీ వర్షంలోనూ జన సందోహం.. జగన్‌కు ఇది సరిపోతుందా..?

జగన్ (YS Jagan) చాలా కాలం తర్వాత ప్రజల్లోకి వచ్చారు. నర్సీపట్నంలో (Narsipatnam) మెడికల్ కాలేజీ (Medical College) నిర్మాణాన్ని సందర్శించారు. అయితే జగన్ పర్యటనపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వై.ఎస్. జగన్ పర్యటన సమయంలో భారీ వర్షం కురిసింది. అయినా జనం భారీగా తరలిరావడం, గంటల తరబడి వేచి చూడటం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్నాయి. జగన్ పట్ల ప్రజల్లో ఇంకా పట్టు, అభిమానం చెక్కుచెదరలేదని ఈ దృశ్యాలు రుజువు చేస్తున్నాయి. అయితే జగన్ అధికారంలోకి రావడానికి ఈ అభిమానం సరిపోతుందా.. అనే చర్చ కూడా జరుగుతోంది.
గత కొంతకాలంగా జగన్ ప్రజల్లోకి రావడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదనే విమర్శ ఉంది. పార్టీ వ్యవహారాలకే పరిమితమై, సభలు, సమావేశాలను దూరంగా ఉంటున్నారు. అడపాదడపా తాడేపల్లిలో ప్రెస్ మీట్లు మాత్రం పెడుతున్నారు. దీనిపట్ల సొంత పార్టీ వర్గాల్లోనే కొంత అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో, నర్సీపట్నం సభకు లభించిన స్పందన చూశాక, ఇకనైనా జగన్ నెలలో కనీసం ఒకటి, రెండు సార్లయినా జనంలోకి వస్తే బాగుంటుందని పార్టీ కేడర్ ఆశిస్తోంది. నర్సీపట్నం పర్యటన దానికి నాంది పలుకుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఈ డిమాండ్‌ను జగన్ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.
అయితే, ఇక్కడో విషయం గుర్తు పెట్టుకోవాలి.వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా ఈ జనసమీకరణను అత్యంత విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. “జోరు వానలోనూ ప్రజలు కదల్లేదు,” “జగన్ కోసం జనం ఎదురుచూశారు” అంటూ హెడ్ లైన్స్ పెట్టి పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. అయితే గతంలో అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన ‘సిద్ధం’ సభలకు కూడా జనం ఇదే స్థాయిలో తరలివచ్చారు. కానీ ఈ జన సందోహం అభిమానం అవుతుందే తప్ప, అది ఓట్ల రూపంలోకి మళ్లినప్పుడే పార్టీకి నిజమైన ప్రయోజనం ఉంటుంది. కేవలం సోషల్ మీడియాలో లైక్‌లు, షేర్‌లు కొట్టుకోవడానికి ఈ హైప్ ఉపయోగపడుతుందే తప్ప, వాటిని చూసి సంబరపడితే మొదటికే మోసం వస్తుందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. భారీ జనసమీకరణ అంటే విజయం అనే భ్రమలో ఉంటే, క్షేత్ర స్థాయిలో పార్టీ ఎదుర్కొంటున్న ఇతర సమస్యలు పరిష్కారం కాకుండా పోతాయని నిపుణులు అంటున్నారు.
మరో కీలక అంశం ఏమిటంటే, జగన్ ఎప్పుడు జనంలోకి వచ్చినా, ఆయన ఎందుకొచ్చారనే దాని కంటే జనంపైన ఫోకస్ మళ్లుతోంది. దీంతో అసలు విషయం పక్కదారి పడుతోంది. కేడర్ కూడా జన సమీకరణపైన, హంగామాపైనే ఎక్కువగా దృష్టి సారించడం కనిపిస్తోంది. పర్యటనల ప్రధాన ఉద్దేశ్యం, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడం. కేవలం జనాన్ని చూపించి రాజకీయ ప్రత్యర్థులకు ఒక బలం ప్రదర్శించడంపైనే అధిక ఫోకస్ ఉంటోందనే విమర్శ ఉంది. దీనివల్ల, జగన్ పర్యటనల అసలు లక్ష్యం పక్కదారి పడుతోంది. కేవలం గుంపును చూపిస్తే సరిపోదు, ఆ గుంపు మనసులో ఏముందో గ్రహించి, సరైన సబ్జెక్టుతో వారిని ఆకట్టుకోవాల్సిన అవసరం ఉంది.
మొత్తంగా, నర్సీపట్నం పర్యటన జగన్‌కు ఉన్న ప్రజాదరణను మరోసారి నిరూపించింది. ఆ ప్రజాదరణను ఓటు బలంగా మార్చుకోవడానికి, కేవలం సోషల్ మీడియా హైప్‌లకు పరిమితం కాకుండా, ప్రజా సమస్యలనే ప్రధాన అంశంగా చేసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.