అన్నదాతకు రైతు భరోసా…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నంపెట్టే అన్నదాత కోసం రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టారు. రైతు కష్టాలను పాదయాత్రలో చూసిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతుకు చేయూతనిచ్చేందుకు రైతు భరోసాను అందించారు.
గత కొంతకాలంగా వరుస నష్టాలను చవిచూస్తూ పంటలకు తిరిగి పెట్టుబడి పెట్టలేని స్థితిలో రైతులు ఉన్నారు. ఓ ఏడు అతి వష్టి.. మరో ఏడాది అనావష్టి.. ఇవేవీ కాకపోతే మందులకూ లొంగని తెగుళ్లతో కంటికి రెప్పలా కాపాడుకున్న పంటను రైతు ఏదోవిధంగా కోల్పోతూనే ఉన్నాడు. దీంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రైతులు వ్యవసాయమంటేనే భయపడే పరిస్థితి దాపురించింది. వాస్తవ పరిస్థితులను తన పాదయాత్రలో కళ్లారా చూసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నం పెట్టే అన్నదాతకు చేయూతనివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగానే రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకున్నాక రైతు ఆర్థిక పరిస్థితులపై ప్రత్యేకంగా దష్టిసారించారు. ప్రతి రైతుకూ పూర్తిస్థాయిలో సాయాన్ని అదించలేకపోయినా, ప్రతి ఏటా వ్యవసాయ సీజన్ ప్రారంభంలో పెట్టుబడి సాయం కింద ప్రతి రైతుకు రూ. 13,500 వంతున చెల్లించాలని, అందుకోసం రైతు భరోసా అనే పథకాన్ని రూపకల్పన చేసింది. రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలో సుమారు 53 లక్షల మంది లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా చేయూతనిస్తున్నారు.
ఐదెకరాల్లోపు ఉన్న రైతులంతా అర్హులే..
రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులతోపాటు ఐదెకరాలలోపు వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఫలాలను అందించబోతున్నారు. అందుకు సంబంధించి జిల్లాల వారీగా జాబితా కూడా సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఐదెకరాలలోపు భూమి కలిగిన రైతులు 66,54,891 మంది ఉన్నారు. వీరిలో సుమారు 15 లక్షల మంది కౌలు రైతులు కూడా ఉన్నారు. అయితే, కౌలురైతుల్లో కేవలం 5 లక్షల మందికి మాత్రమే ఇప్పటి వరకూ గుర్తింపు కార్డులు ఇచ్చారు. మిగిలిన 10 లక్షల మందికి కార్డులు లేకపోయినప్పటికీ కూడా పథకాన్ని వారికి కూడా వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రైతు భరోసా పథకానికి సంబంధించి అర్హులైన రైతులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రతి జిల్లాలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే ఐదెకరాలలోపు భూములున్న రైతుల నుండి దరఖాస్తులు ఆహ్వానించారు. ఆ దిశగా అధికారులు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తుది జాబితాను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 79,33,914 మంది ఖాతాదారులు స్థానికంగా ఉండే ఎంపీఈవో, ఏఈవోలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 48,85,845 ఖాతాలను వారు ఆమోదించగా 30,30,900 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించారు. మరో 17,169 దరఖాస్తులను పెండింగ్లో ఉంచారు. అయితే, ఇక్కడ ఆమోదించిన 48,85,845 ఖాతాలను మండల అగ్రికల్చర్ ఆఫీసర్లు పరిశీలించి అందులో 31,485 ఖాతాలను తిరస్కరించగా మరో 16,813 ఖాతాలను పెండింగ్లో ఉంచారు. తిరస్కరించిన, పెండింగ్లో ఉంచిన ఖాతాలకు సంబంధించి అధికారులు అడిగిన పత్రాలు సమర్పిస్తే పరిశీలించి వాటిని కూడా ఆమోదించనున్నారు.
రైతుల కష్టాలను చూసి 2017 పార్టీ ప్లీనరీ సమావేశంలోనే రైతు భరోసా అందిస్తామని హామీ ఇచ్చినట్లుగానే వైఎస్ జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా తొలి వాగ్దానంగా రైతు భరోసా ప్రకటించారు. రైతు భరోసాతో సుమారు 54 లక్షల మంది రైతన్నలకు మేలు జరుగుతుంది.













