నెల్లూరు సభలో జననేత
వచ్చే గురువారం జరిగే ఎన్నికల్లో మార్పు కోసం ఓటు వేయాలని, తమకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. తనకు అవకాశం ఇస్తే, మహానేత వైయస్సార్ (నాన్న) కంటే మెరుగైన పాలన అందిస్తానని, మార్పు చేసి చూపిస్తానని, ప్రతి ఒక్కరికి మేలు చేస్తానని శ్రీ వైయస్ జగన్ వెల్లడించారు.
నెల్లూరులో గురువారం మధ్యాహ్నం శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఎండలు మండుతున్నా లెక్క చేయకుండా సభకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో నగరంలో అంతులేని సందడి నెలకొంది.
నెల్లూరు బ్యారేజీ
నెల్లూరుకు తాగు, సాగు నీరు అందించే నెల్లూరు బ్యారేజీ పనులు నాడు మహానేత వైయస్సార్ చేపట్టి, దాదాపు సగం పనులు పూర్తి చేశారని, కానీ ఆ తర్వాత ఇవాళ్టికి కూడా ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదని శ్రీ వైయస్ జగన్ తెలిపారు.
సీఎం అనాలా? రాక్షసుడు అనాలా?
నెల్లూరు సమీపంలో వెంకటేశ్వరపురంలో అవినీతితో ఫ్లాట్లు కడుతున్నారని, పేదల నుంచి కూడా దోచుకునే విధంగా దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నారని, అందుకని చంద్రబాబును సీఎం అనాలా? లేక రాక్షసుడు అనాలా? అని జననేత ప్రశ్నించారు.
ఫ్లాట్లు–అవినీతి
‘పేదల కోసం ఫ్లాట్లు కడుతున్న భూమి ఉచితం. ఇసుక ఫ్రీ. వాటిలో గ్రానైట్ ఉండదు. లిఫ్ట్ కూడా ఉండదు. కాబట్టి వాటి నిర్మాణానికి అడుగుకు రూ.1000 కూడా ఖర్చు కాకున్నా అడుగుకు రూ.2 వేల చొప్పున అమ్ముతున్నారు. దాంతో 300 అడుగుల ఫ్లాట్‌కు మొత్తం రూ.6 లక్షలు అవుతుండగా, వాటిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి రూ.1.50 లక్షల చొప్పున భరిస్తే, మిగిలిన రూ.3 లక్షల అప్పును పేదలు నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్ల పాటు కట్టాలట. అంటే లంచం తీసుకునేది చంద్రబాబు. దాన్ని కట్టేది పేదలు. ఇదీ చంద్రబాబు రాక్షస పాలన’ అని శ్రీ వైయస్ జగన్ వివరించారు.
ఆ అప్పు మాఫీ చేస్తాం
ఎన్నికలు వచ్చాయి కాబట్టి, ఆ ఫ్లాట్లు ఇస్తే తీసుకోవాలని కోరారు. రేపు అందరి ఆశీస్సులతో తమ∙ప్రభుత్వం ఏర్పడితే ఆ రూ.3 లక్షల అప్పును పూర్తిగా మాఫీ చేస్తామని జననేత ప్రకటించారు.
దుస్థితిలో నెల్లూరు వర్సిటీ
ప్రతి జిల్లాలో యూనివర్సిటీ ఉండాలని నెల్లూరులో నాడు మహానేత వైయస్సార్ సింహపురి యూనివర్పిటీ ఏర్పాటు చేశారని చెప్పారు. కానీ ఇవాళ ఆ యూనివర్సిటీ పరిస్థితి దారుణంగా ఉందని, వర్సిటీలో 200 లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అక్కడ అవినీతికి అంతం లేదని, విచారణ జరిపినా నివేదిక, చర్యలు లేవని తెలిపారు.
ప్రైవేటు విద్యా సంస్థలకు ఊతం
పేదలకు మంచి చదువు చెప్పించాలని, ప్రభుత్వ రంగంలోని విద్యా సంస్థలను బాగా నిర్వహించాలన్న ఆలోచన చంద్రబాబుకు లేదన్న శ్రీ వైయస్ జగన్, ఆయన ఎంతసేపూ ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తున్నారని ఆక్షేపించారు. కారణం నారాయణ సంస్థల్లో చంద్రబాబు బినామీ కావడమే అని చెప్పారు. కాగా ఇవాళ ఆ నారాయణ విద్యా సంస్థలలో ఎల్‌కేజీకే రూ.25 వేలు వసూలు చేస్తున్నారని, ఈ పరిస్థితులలో వాటిలో పేదల చదువుకు అవకాశమే లేదని స్పష్టం చేశారు.
అధర్మం–అవినీతి
నెల్లూరులోని జనార్దన్రెడ్డినగర్లో ఉన్న పేదల ఇళ్ల స్థలాలను దయ లేకుండా లాక్కున్నారని, ఆ విధంగా మోసం, అధర్మం, అవినీతి, అన్యాయమైన పాలన రాష్ట్రంలో సాగుతోందని, ఈ 5 ఏళ్ల నుంచి వ్యవస్థలు కూడా పూర్తిగా భ్రష్టు పట్టిపోయాయని అన్నారు.
ఎమ్మెల్యేపై దుష్ప్రచారం
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అనిల్‌పై ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని శ్రీ వైయస్ జగన్ ప్రస్తావించారు.
‘ఇక్కడే పక్కనే మీ ఎమ్మెల్యే అనిల్ ఉన్నాడు. పేదల మంచి కోసం పరితపించే వ్యక్తి. అందుకు సొంతంగా ఖర్చు కూడా చేస్తున్నారు. కానీ అలాంటి వ్యక్తిని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, టీవీ9తో పాటు చంద్రబాబుకు అమ్ముడుపోయిన మీడియా ఆయనను విలన్లా చూపుతున్నాయి. ఏడాది క్రితం మాట్లాడిన మాటలను వక్రీకరించి చూపుతున్నాయి. అదే నారాయణ విద్యా సంస్థలలో ఎన్ని అరాచకాలు జరిగినా ఇదే మీడియా రాయడం లేదు. చూపడం లేదు. పైగా అక్కడ చాలా బాగుంది అన్నట్లుగా ప్రచారం చేస్తున్నాయి’ అని జననేత వివరించారు.
మార్పు కోసం ఓటు వేయండి
వచ్చే గురువారమే ఎన్నికలు కాబట్టి మార్పు కోసం ఓటు వేయాలని కోరారు. 2004 ఎన్నికలను ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్న శ్రీ వైయస్ జగన్, నాడు మహానేత వైయస్సార్‌కు ఒక అవకాశం ఇస్తే, ఆయన ఎలాంటి పాలన అందించారో అందరికీ తెలుసని, చనిపోయిన తర్వాత కూడా ఆయన ఎందరో గుండెల్లో నిల్చారని గుర్తు చేశారు.
ఒక్క అవకాశం ఇవ్వండి
కాబట్టి ఈసారి ఒక్క అవకాశం ఇవ్వాలని, నాన్నగారి కంటే మెరుగైన పాలన అందిస్తానని, చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో, మహానేత వైయస్సార్ ఫోటో పక్కన తన ఫోటో కూడా ఉండాలన్నదే లక్ష్యమని శ్రీ వైయస్ జగన్ పేర్కొన్నారు.
కచ్చితంగా మార్చు చేసి చూపుతానని, మంచి పాలన అందిస్తానని వెల్లడించారు. 3648 కి.మీ పాదయాత్ర చేశానని, ప్రజల కోసం ఎన్నో ఆందోళనలు చేశానని, వారి సమస్య పరిష్కారం కోసం కృషి చేశానని తెలిపారు.
ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి, మళ్లీ గెలుపు కోసం చంద్రబాబు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని చెప్పారు.
గ్రామాలకు మూటల డబ్బులు
ఎన్నికలు ఇంకా దగ్గరకు వచ్చే సరికి కుట్రలు మరింత తీవ్రమవుతాయని, ఎన్నికలు రావడంతో ప్రతి గ్రామానికి మూటలకొద్దీ డబ్బు పంపిస్తారని, ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు పెడతారని, ఆ విధంగా అందరినీ కొనే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు.
ఈ కుట్రను జయించాలని, అందుకే ప్రతి ఒక్కరూ తమ తమ గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లాలని, ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అన్న, ప్రతి అవ్వ, ప్రతి తాత, ప్రతి రైతును కలిసి, చంద్రబాబు చేస్తున్న మోసాలు వివరించాలని కోరారు.
వారికి ఇవన్నీ వివరించండి
‘అక్కా చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు. వారం రోజులు ఓపిక పట్టి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఆ తరవాత మన పిల్లలను కేవలం బడికి పంపిస్తే చాలు అన్న ప్రతి ఏటా రూ.15 వేలు చేతిలో పెడతాడని చెప్పండి. అంతే కాకుండా మన పిల్లలను ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్ వంటి చదువులు చదివించే పరిస్థితి లేదని, పిల్లల చదువు కోసం ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోందని గుర్తు చేయండి. అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోకుండా, వారం రోజులు ఓపిక పట్టి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే మన పిల్లలు ఇంజనీరింగ్, డాక్టర్, కలెక్టర్ వంటి ఏ చదువు చదవాలన్నా అన్న చదివిస్తాడని, ఎన్ని లక్షలు ఖర్చైనా అన్న చదివిస్తాడని చెప్పండి’.
‘పొదుపు సంఘాలలో ఉన్న ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను కలవండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని చెప్పండి. అక్కా చంద్రబాబుకు 5 ఏళ్ల సమయం ఇచ్చాం. మన రుణాలు మాఫీ చేస్తానన్నాడు. మరి చేశాడా? అని అడగండి. అదే విధంగా సున్నా వడ్డీ రుణాలు కూడా రావడం లేదని,ఆ పథకాన్ని ఏకంగా రద్దు చేశారని గుర్తు చేయండి. అందుకే మళ్లీ మోసపోవద్దని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి’.
‘అక్కా వారం రోజులు ఓపిక పట్టి, అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే, ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళలకు ఉన్న మొత్తం రుణాన్ని నేరుగా నాలుగు దఫాల్లో వారి చేతుల్లోను పెడతాడని ప్రతి అక్కకు చెప్పండి. అంతే కాకుండా మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని, సున్నా వడ్డీ రుణాలు అందుతాయని, అది ఆయన కొడుకు జగనన్నతోనే సా««ధ్యమని చెప్పండి. అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని చెప్పండి’.
‘పేదరికంలో ఉండి అవస్థలు పడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు చెప్పండి. 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న ఆ ప్రతి అక్కను కలవండి. చెప్పండి.. అక్కా, చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, వారం రోజులు ఓపిక పట్టక్కా.. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఆ తర్వాత వైయస్సార్ చేయూత పథకం ద్వారా నాలుగు దఫాల్లో రూ.75 వేలు నేరుగా ప్రతి అక్క చేతిలో పెడతాడని చెప్పండి’.
‘గ్రామాల్లో ప్రతి రైతన్న దగ్గరకు వెళ్లండి. నవరత్నాలు పథకాల గురించి, వాటి వల్ల ఎంత మేలు జరుగుతుందన్నది వివరించండి’.
‘అలాగే గ్రామంలో ప్రతి అవ్వ, ప్రతి తాతను కలవండి. చంద్రబాబు మోసాలు వివరించండి. నవరత్నాలు పథకాల గురించి, వాటి వల్ల కలిగే లాభం గురించి చెప్పండి. అదే విధంగా వారికి వస్తున్న పెన్షన్ గురించి ఆరా తీయండి. ఇవాళ అంటే ఎన్నికలు వచ్చాయి. కానీ మీకు రెండు నెలల క్రితం వరకు ఎంత పెన్షన్ వచ్చేదని అడగండి. అప్పుడు ఆ అవ్వ అంటుంది పెన్షన్ రావడం లేదని, లేదా వెయ్యి రూపాయలు వస్తున్నాయని చెబుతుంది. అవ్వ ఆ సమాధానం చెప్పాక ప్రతి అవ్వను అడగండి. అవ్వా ఇప్పుడు ఎన్నికలు రాకపోయి ఉంటే, జగనన్నే రూ.2 వేలు ఇస్తానని చెప్పకపోయి ఉంటే, ఇప్పుడు చంద్రబాబు రూ.2 వేల పెన్షన్ ఇచ్చేవాడా?’ అని అడగండి.
‘అందుకే ప్రతి అవ్వకు చెప్పండి. ప్రతి తాతకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, వారం రోజులు ఓపికపడితే, మీ మనవడు ముఖ్యమంత్రిని అవుతాడని చెప్పండి. అలా మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అవ్వా తాతలకు ఇచ్చే పెన్షన్ రూ.3 వేలకు పెంచుకుంటూ పోతాడని చెప్పండి’ అని శ్రీ వైయస్ జగన్ కోరారు.
నవరత్నాలు
నవరత్నాలు పథకాలు ప్రతి కుటుంబంలో మేలు చేస్తాయని చెప్పాలని, వాటిని ప్రతి ఇంటికి తీసుకుపోవాలని సూచించారు. ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి అవ్వ, ప్రతి తాతకు వాటి గురించి వివరించాలని కోరారు. నవరత్నాలతో ప్రతి నిరుపేద జీవితం బాగుపడుతుందని, ప్రతి రైతు, మహిళ ముఖంలో చిరునవ్వులు చూడవచ్చని నమ్ముతున్నారు. అందుకే ఆ పథకాలను కచ్చితంగా ప్రతి ఇంటికి చేరుస్తామని హామీ ఇచ్చారు.
వ్యవస్థ మారాలి
ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలని, ఒక నాయకుడు ఏదైనా చేస్తానని చెప్పి, ఆ అంశాన్ని ప్రణాళికలో పెట్టి, ఆ తర్వాత దాన్ని అమలు చేయకపోతే, ఆ పదవిని వీడి ఇంటికి పోవాలని, అప్పుడే ఈ రాజకీయాలలో నిజాయితీ, విశ్వసనీయత వస్తాయని స్పష్టం చేశారు. అందుకు అందరి సహకారం కావాలని కోరారు.
పార్టీ అభ్యర్థుల పరిచయం
నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పి.అనిల్‌కుమార్ యాదవ్‌తో పాటు, పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డిని సభకు పరిచయం చేసిన శ్రీ వైయస్ జగన్, ఇద్దరినీ మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైయస్సార్సీపీ గుర్తు ఫ్యాన్‌ను కూడా సభకు చూపిన ఆయన, గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.













