గాజువాకలో జననేత ఎన్నికల ప్రచార సభ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే యువత ఉపాధి కల్పనకు కూడా ప్రాధాన్యం ఇస్తామని, ఆదాయం వచ్చే ప్రభుత్వ కాంట్రాక్ట్‌లు, ఆర్టీసీ నిర్వహించే ప్రైవేటు బస్సులు, ప్రభుత్వ శాఖల్లో అద్దె వాహనాల్లో నిరుద్యోగులకే అవకాశం ఇస్తామని, అందుకోసం ఒక ప్రత్యేక చట్టం తీసుకొస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఇంకా వారు వాహనాలు కొనుక్కుంటే సబ్సిడీ ఇవ్వడంతో పాటు, వాటన్నింటిలో 50 శాతం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు కేటాయిస్తామని ఆయన వెల్లడించారు.
ఇంకా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్ జారీ చేస్తామని, ఏటా జనవరి 1న ప్రభుత్వ ఉద్యోగాలపై క్యాలెండర్ విడుదల చేస్తామని, గ్రామాలు, వార్డులలో 10 మందితో సచివాలయాలతో పాటు, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించి, వారికి రూ.5 వేల వేతనం చెల్లిస్తామని తెలిపారు. ఇంకా ప్రత్యేక హోదా సాధిస్తామని, తద్వారా ఉద్యోగ, ఉపాధి విప్లవం సాధ్యమని జననేత పేర్కొన్నారు.
విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం సాయంత్రం శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. సభకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసి పోయింది.
విశాఖ–మహానేత
విశాఖపట్నం, గాజువాక గురించి మాట్లాడాల్సి వచ్చినా కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాలని, ఒక్కసారి మహానేత వైయస్సార్ పాలనను గుర్తు చేసుకోవాలని శ్రీ వైయస్ జగన్ అన్నారు. మహానేత వైయస్సార్ 5 ఏళ్ల 3 నెలల పాలనలో విశాఖ ప్రగతిని చూడాలన్న ఆయన, పలు అంశాలు ప్రస్తావించారు.
కేంద్రంతో పోట్లాడి విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను అడ్డుకున్నారని, ఆ సంస్థ విస్తరణకు నిధులు సేకరించారని, ఇంకా ఎన్టీపీసీ, హెచ్‌పీసీఎల్ విస్తరణ పనులు ఆయన హయాంలోనే జరిగాయని, మూతబడిన బీహెచ్‌పీవీని బీహెచ్ఈఎల్లో విలీనం చేయించి, కొన్ని వందల కుటుంబాలను ఆదుకున్నారని, షిప్‌యార్డును రక్షణ శాఖలో విలీనం చేయించి దాన్ని కాపాడారని చెప్పారు.
ఇంకా అచ్యుతాపురంలో ఎస్ఈజెడ్, విశాఖ దువ్వాడలో ఐటీ కారిడార్, పరవాడలో ఫార్మాసిటీని విశాఖకు తీసుకువచ్చారని, దీంతో కొన్ని వేల ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు. వరద ముప్పు నుంచి విమానాశ్రయాన్ని కాపాడి,దాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేసింది కూడా వైయస్సార్ అని గుర్తు చేసుకోవాలని జననేత అన్నారు.
చంద్రబాబు హయాంలో
ఇక చంద్రబాబు హయాంలో ఏం చేశారన్నది బేరీజు వేసుకోవాలన్న జననేత, గత 5 ఏళ్లలో అక్కడ చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే స్టీల్ ప్లాంట్ అంపశయ్యపైకి చేరిందని, ఆయన విశాఖను కుంభకోణాల అడ్డాగా మార్చారని, కొండలు, గుట్టలు, ప్రభుత్వ భూములు, ప్రైవేటు ఆస్తులు ఏవీ వదిలి పెట్టలేదని, విచ్చలవిడిగా లక్షల కోట్ల అవినీతి, భూకుంభకోణాలు జరిగాయని తెలిపారు. చివరకు తన మంత్రులు, నాయకులు, కొడుకును కాపాడుకునేందుకు తన అధీనంలోనే పని చేసే సిట్ వేశారని, కానీ ఆ నివేదికలు ఏమయ్యాయో తెలియదని ప్రస్తావించారు.
కారుచౌకగా..
ఒక్కసారి భూకుంభకోణాలు కూడా చూడాలన్న శ్రీ వైయస్ జగన్, చంద్రబాబు తన బినామీలకు కారుచౌకగా భూములు అప్పగించారని తెలిపారు. బీచ్ రోడ్లో రూ.1000 కోట్ల విలువైన భూమిని దుబాయికి చెందిన లులూ గ్రూప్‌నకు స్టార్ హోటల్ కట్టడం కోసం ఇచ్చారని చెప్పారు.
భాగస్వామ్య సదస్సులు
ఇంకా నగరంలో స్కామ్‌లు కూడా చేశారని, ఏటా ఒక రోజు ఇక్కడ భాగస్వామ్య సదస్సులు నిర్వహించారని, అలా మూడుసార్లు నిర్వహించిన సదస్సులకు అక్షరాలా రూ.150 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. ఆ సదస్సుల ద్వారా రాష్ట్రంలో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పారని గుర్తు చేశారు. మరి నిజంగా ఆ ఉద్యోగాలు వచ్చాయా? అని ప్రశ్నించారు.
హోదాపై పెట్టి ఉంటే..
చంద్రబాబు ఆ సదస్సులపై చూపిన శ్రద్ధను ఒకవేళ ప్రధానిపై పెట్టి ఉంటే, ఈపాటికి హోదా వచ్చి ఉండేదని, దాంతో ఎందరికో ఉద్యోగాలు వచ్చేవని అన్నారు.
అణిచివేశారు
ఇదే విశాఖపట్నంలో ప్రత్యేక హోదా ఉద్యమాలను అణిచివేశారని, ఇక్కడ ధర్నా కోసం విపక్షనేత హోదాలో తాను వస్తే, ఎయిర్‌పోర్టులోనే అడ్డుకుని వెనక్కి పంపారని గుర్తు చేశారు. ఇంకా ఇక్కడి విమానాశ్రయం, వీఐపీ లాంజ్‌లోనే విపక్షనేతపై (నాపై) కత్తితో దాడి చేయించే స్థాయికి నగరాన్ని తీసుకుపోయారని ఆక్షేపించారు.
ఉద్యోగాలు పోయాయి
ఇక్కడ ఐటీ రంగం రివర్స్ అయిందని, గతంలో ఇక్కడ 16 వేల ఉద్యోగాలు ఉంటే, ఇప్పుడు వాటి సంఖ్య 12 వేలకు తగ్గిందని చెప్పారు.
ప్రైవేటు వర్సిటీలు
ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించేందుకు ఎంతో చరిత్ర ఉన్న
ఆంధ్రా యూనివర్సిటీని నిర్వీర్యం చేస్తున్నారని, టీచర్ పోస్టులు భర్తీ చేయడం లేదని, తద్వారా చంద్రబాబు తన బినామీకి చెందిన గీతమ్‌కు విద్యార్ధులు వెళ్లేలా చేస్తున్నారని ఆరోపించారు.
విమ్స్ దుస్థితి
నిమ్స్ తరహాలో విమ్స్ కోసం 100 ఎకరాల్లో 1130 పడకల ఆస్పత్రిని నిర్మించడం కోసం నాడు మహానేత వైయస్సార్ రూ.250 కోట్లు కేటాయించి పనులు చేశారని, కానీ అక్కడ ఇవాళ 21 స్పెషాలిటీ విభాగాలకు గానూ కేవలం మాత్రమే పని చేస్తున్నాయని చెప్పారు.
ఇక కేజీహెచ్ పరిస్థితి దారుణంగా ఉందని, ఒక్కో బెడ్‌పై ఇద్దరు రోగులను పండబెడుతున్నారని, ఆ స్థాయిలోకి నగరాన్ని దిగజార్చారని ఆవేదన చెందారు.
గాజువాక
గాజువాక పారిశ్రామిక వాడలో స్థానికులకు ఉద్యోగాలు రావడం లేదని గుర్తు చేశారు. కాగా ఇక్కడే ఉక్కు ఫ్యాక్టరీ నిర్వాసితులకు మహానేత వైయస్సార్, స్టీల్ ప్లాంట్‌లో 50 శాతం ఉద్యోగాలు ఇచ్చే విధంగా చట్టం చేశారని, ఆ మేరకు 16 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి ఉండగా, ఇంకా 9 వేల మందిని తీసుకోవాల్సి ఉందని చెప్పారు.
4 లక్షల జనాభా ఉన్న గాజువాకలో డంపింగ్ యార్డు సమస్య ఉందని, పెద గంట్యాడ నుంచి తరలించాలన్నా పట్టించుకోవడం లేదని చెప్పారు. ఇక్కడ పారిశ్రామిక వాడ ఉన్నా, పాలిటెక్నిక్ కళాశాల కూడా లేదని, ఆ కళాశాల ఏర్పాటు చేస్తామన్న సీఎం చంద్రబాబు హామీ కూడా అమలు కాలేదని, చివరకు ఇక్కడ డిగ్రీ కళాశాల కూడా లేదని తెలిపారు.
ఇక్కడికి రోజూ వేల సంఖ్యలో వాహనాలు వస్తాయని, కానీ కనీసం ఒక ట్రక్కు బే కూడా లేదని గుర్తు చేశారు. అందుకే మహానేత వైయస్సార్ హయాంలో జరిగిన పనులను బేరీజు వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
నిరుద్యోగ సమస్య
తన సుదీర్ఘ 3648 కి.మీ పాదయాత్రలో ఏ గ్రామం, పట్టణానికి వెళ్లినా ఏ ఇంట్లో చూసినా.. అన్నా ఉద్యోగం లేదు అన్న సమస్య వినిపించిందని శ్రీ వైయస్ జగన్ వెల్లడించారు.
చంద్రబాబు ఏం చేశారు?
ఈ 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలన్న జననేత, నాడు జాబు రావాలంటే బాబు రావాలని ప్రచారం చేశారని, వాస్తవంగా ఏం జరిగిందో చూడాలని కోరారు.
రాష్ట్ర విభజన నాటికి 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కమలనాధన్ కమిటీ తేల్చిందని, వాటిని భర్తీ చేస్తారని నిరుద్యోగులు వేలకు వేలు ఖర్చు చేస్తూ పరీక్షలకు సిద్ధమవుతున్నారని, మరోవైపు రిటైర్మెంట్లతో ఉద్యోగ ఖాళీల సంఖ్య 2.30 లక్షలకు చేరిందని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలలు
ప్రభుత్వ పాఠశాలల్లో 23 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా, భర్తీ చేయకుండా ఆ స్కూళ్లను నిర్వీర్యం చేస్తున్నారని, వాటికి సమయానికి పుస్తకాలు ఇవ్వడం లేదని, మధ్యాహ్న భోజన పథకంలో బిల్లులు చెల్లించడం లేదని తెలిపారు. ఆ పిల్లలంతా తన బినామీకి చెందిన నారాయణ స్కూళ్లకు పోవడమే చంద్రబాబు లక్ష్యం అని ఆరోపించారు. కాగా, అదే నారాయణ స్కూళ్లలో ఇవాళ ఎల్‌కేజీకే రూ.25 వేలు వసూలు చేస్తున్నారని తెలిపారు.
నిరుద్యోగ భృతి
ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోతే నెలకు రూ.2 వేల భృతి ఇస్తానని చెప్పి, అలా ఇవ్వకపోవడంతో ఇవాళ ప్రతి ఇంటికి రూ.1.20 లక్షలు బాకీ పడ్డారని చెప్పారు. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లేదని, మరోవైపు హోదాను కూడా తాకట్టు పెట్టారని ఆక్షేపించారు.
కానీ ఎన్నికలు రావడంతో రాష్ట్రంలో 1.70 కోట్ల ఇళ్లుంటే కేవలం 3 లక్షల మందికి నెలకు రూ.1000 చొప్పున 3 నెలలు మాత్రమే నిరుద్యోగ భృతి ఇచ్చారని గుర్తు చేశారు.
వీటన్నింటి నేపథ్యంలో ఇవాళ బాబు వచ్చాడు. ఉద్యోగాలు పోయాయి అన్నట్లుగా మారిందంటూ.. చంద్రబాబు హయాంలో ఎన్నెన్ని ఉద్యోగాలు పోయాయన్నది ప్రస్తావించారు.
గోవిందా గోవిందా:
– 30 వేల మంది ఆదర్శౖ రెతుల ఉద్యోగాలు.
– గృహ నిర్మాణ శాఖలో 3500 మంది వర్క్ ఇన్స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్ల ఉద్యోగాలు.
– 1000 గోపాలమిత్రల ఉద్యోగాలు.
– ఆయుష్ విభాగంలో 800 మంది ఉద్యోగాలు.
– సాక్షరభారత్లో 30 వేల మంది ఉద్యోగాలు.
– మధ్యాహన భోజన పథకంలో 14 ఏళ్ల నుంచి పని చేస్తున్న 85 వేల మంది కార్మికుల ఉద్యోగాలు.
అని వివరించిన శ్రీ వైయస్ జగన్, మరోవైపు ఉన్న ఉద్యోగుల్లో చాలా మందికి జీతాలివ్వడం లేదని చెప్పారు. జీతాలు పెంచాలని కోరిన వారిపై కేసులు పెట్టించారని తెలిపారు. ఇంకా తన 3648 కి.మీ పాదయాత్రలో నిరుద్యోగుల బాధలు చూశానని, అందుకే భరోసా ఇస్తున్నానని, అదే ‘నేను ఉన్నాను’ అని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే నిరుద్యోగులకు ఏమేం చేస్తామన్నది శ్రీ వైయస్ జగన్ వివరించారు.
అధికారం చేపడితే..
– ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు ఒకేసారి విడుదల.
– ఏటా జనవరి 1న ప్రభుత్వ ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటన.
– గ్రామాలలో మాదిరిగా ప్రతి వార్డులో 10 మందితో సచివాలయం ఏర్పాటు. ఆ విధంగా చదువుకున్న 10 మందికి ఉద్యోగాలు ఇస్తాము.
– అదే విధంగా వార్డులలో కూడా ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ నియామకం. వారికి రూ.5 వేల గౌరవ వేతనం.
గ్రామాలు, వార్డులలో సచివాలయాలతో పని చేసే వాలంటీర్లు.. ఆ 50 ఇళ్ల వారికి ఏం కావాలన్నా చేసి పెడతారు. దరఖాస్తు చేసిన 72 గంటల్లోనే వాటిని పరిష్కరిస్తారు. ఈ ప్రక్రియలో ఎక్కడా వివక్ష ఉండదు. కలం, మతం, రాజకీయం, పార్టీ ఏదీ చూడం. పూర్తి పారదర్శకంగా వారంతా పని చేస్తారు. ఇంకా చెప్పాలంటే రేషన్, బియ్యంతో సహా, అన్ని ప్రభుత్వ పథకాలను డోర్ డెలివరీ చేస్తారు.
– ఆదాయం వచ్చే ప్రభుత్వ కాంట్రాక్ట్‌లు. ఆర్టీసీ నిర్వహించే ప్రైవేటు బస్సులు, వివిధ శాఖల్లో అద్దెకు తీసుకునే వాహనాల్లో నిరుద్యోగులకు ప్రాధాన్యం ఇస్తాము. ఇందుకోసం అసెంబ్లీలో ఒక చట్టం కూడా చేస్తాము.
– అంతే కాకుండా.. వారు వాహనాలు కొనుక్కుంటే సబ్సిడీ ఇస్తాం.
– వీటన్నింటిలో 50 శాతం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు.
– ప్రత్యేక హోదా సాధన. తద్వారా పెట్టుబడుల రాక. ఉద్యోగ, ఉపాధిలో విప్లవం.
రాష్ట్రంలో మొత్తం 25 మంది ఎంపీలను గెలిపించుకుంటే, పక్కన తెలంగాణకు చెందిన 17 మంది ఎంపీలు కూడా తోడైతే.. మొత్తం 42 మంది ఎంపీలు ఒకే తాటిపై నిలబడి హోదా కావాలంటే.. కేంద్రం ఇచ్చి తీరుతుంది. ఎందుకంటే ఏ పార్టీ కూడా ఇవాళ పూర్తి మెజారిటీ సాధించే అవకాశం లేదు. కాబట్టి మన మద్దతు తప్పనిసరి అవుతుంది.
అందుకే హోదా ఇచ్చే వారికే మనం మద్దతు ఇస్తాము. ఆ విధంగా హోదా సాధిస్తే, పెట్టుబడులు వస్తాయి. హోటళ్లు, ఆస్పత్రులు, పరిశ్రమలు వస్తాయి. అప్పుడు ఉద్యోగాల విప్లవం వస్తుంది. అని శ్రీ వైయస్ జగన్ వివరించారు.
5 ఏళ్లలో ఏమేం చూశాం?
చంద్రబాబు పరిపాలనలో మనం చూసింది మోసం మాత్రమే అని, ఇంకా మనకు మోసం, అబద్ధం, అవినీతి, అధర్మం మాత్రమే కనిపించాయని అన్నారు.
కుట్రలు–కుతంత్రాలు
గత 20 రోజులుగా రాజకీయాలు ఎంతగా దిగజారాయో అందరూ చూస్తున్నారని, ఇవాళ ధర్మం–అధర్మం మధ్య ఈ యుద్ధం జరుగుతోందని తెలిపారు. అంతే కాకుండా ఇవాళ తమ యుద్ధం కేవలం చంద్రబాబుతో మాత్రమే కాకుండా, ఆయనకు కొమ్ము కాస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, టీవీ9తో పాటు, ఆయనకు అమ్ముడుపోయిన మొత్తం మీడియాతో, ఛానళ్లతో యుద్ధం చేస్తున్నామని చెప్పారు.
గ్రామాలకు మూటల డబ్బులు
ఎన్నికలు ఇంకా దగ్గరకు వచ్చే సరికి కుట్రలు మరింత తీవ్రమవుతాయని, ఎన్నికలు రావడంతో ప్రతి గ్రామానికి మూటలకొద్దీ డబ్బు పంపిస్తారని, ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు పెడతారని, ఆ విధంగా మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు.
ఈ కుట్రను జయించాలని, అందుకే ప్రతి ఒక్కరూ తమ తమ గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లాలని, ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అన్న, ప్రతి అవ్వ, ప్రతి తాత, ప్రతి రైతును కలిసి, చంద్రబాబు చేస్తున్న మోసాలు వివరించాలని కోరారు.
వారికి ఇవన్నీ వివరించండి
‘అక్కా చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు. నాలుగు రోజులు ఓపిక పట్టి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఆ తరవాత మన పిల్లలను కేవలం బడికి పంపిస్తే చాలు అన్న ప్రతి ఏటా రూ.15 వేలు చేతిలో పెడతాడని చెప్పండి. అంతే కాకుండా మన పిల్లలను ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్ వంటి చదువులు చదివించే పరిస్థితి లేదని గుర్తు చేయండి. ఇవాళ ఇంజనీరింగ్ ఫీజులు లక్ష రూపాయలు దాటినా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో రూ.35 వేల వరకే ఇస్తున్నారని, దీంతో పిల్లల చదువు కోసం ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోందని చెప్పండి’.
‘ అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోకుండా, నాలుగు రోజులు ఓపిక పట్టి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని, ఆ తర్వాత మన పిల్లలు ఇంజనీరింగ్, డాక్టర్, కలెక్టర్ వంటి ఏ చదువు చదవాలన్నా అన్న చదివిస్తాడని, ఎన్ని లక్షలు ఖర్చైనా అన్న చదివిస్తాడని చెప్పండి’.
‘పొదుపు సంఘాలలో ఉన్న ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను కలవండి. చంద్రబాబు చేసే మోసాలకు బలి కావద్దని చెప్పండి. అక్కా చంద్రబాబుకు 5 ఏళ్ల సమయం ఇచ్చాం. మన రుణాలు మాఫీ చేస్తానన్నాడు. కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా? అని అడగండి. అదే విధంగా సున్నా వడ్డీ రుణాలు కూడా రావడం లేదని గుర్తు చేయండి. ఆ పథకాన్ని రద్దు చేశాడని కూడా చెప్పండి. అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, పసుపు–కుంకుమ డ్రామాకు అస్సలు మోసపోవద్దని ప్రతి అక్కకు చెప్పండి’.
‘అక్కా నాలుగు రోజులు ఓపిక పట్టి, అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఆ తర్వాత ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళలకు ఉన్న మొత్తం రుణాన్ని నాలుగు దఫాల్లో నేరుగా అక్కా చెల్లెమ్మల చేతికే ఇస్తాడని ప్రతి అక్కకు చెప్పండి. అంతే కాకుండా మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని, సున్నా వడ్డీ రుణాలు అందుతాయని, అది ఆయన కొడుకు జగనన్నతోనే అది సా««ధ్యమని చెప్పండి’.
‘పేదరికంలో ఉండి అలమటిస్తున్న ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళల్లో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న ప్రతి అక్కను కలవండి. చంద్రబాబు మోసాలకు మోసపోవద్దని చెప్పండి. నాలుగు రోజులు ఆగి, అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే, వైయస్సార్ చేయూత పథకం ద్వారా నాలుగు దఫాల్లో రూ.75 వేలు చేతిలో పెడతాడని ప్రతి అక్కకు చెప్పండి’.
‘గ్రామంలో ప్రతి అవ్వ, ప్రతి తాతను కలవండి. చంద్రబాబు మోసాలు వివరించండి. అదే విధంగా వారికి వస్తున్న పెన్షన్ గురించి ఆరా తీయండి. ఇవాళ అంటే ఎన్నికలు వచ్చాయి. కానీ మీకు రెండు నెలల క్రితం వరకు ఎంత పెన్షన్ వచ్చేదని అడగండి. అప్పుడు ఆ అవ్వ అంటుంది అసలు పెన్షన్ రాలేదని, లేదా వెయ్యి రూపాయలు వచ్చేవని చెబుతుంది. అవ్వ ఆ సమాధానం చెప్పాక ఆ అవ్వను అడగండి. అవ్వా ఇప్పుడు ఎన్నికలు రాకపోయి ఉంటే, జగనన్నే రూ.2 వేలు ఇస్తానని చెప్పకపోయి ఉంటే, ఈ చంద్రబాబు రూ.2 వేలు ఇచ్చేవాడా?’ అని అడగండి.
‘అందుకే ప్రతి అవ్వకు చెప్పండి. ప్రతి తాతకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, వారం రోజులు ఓపిక పడితే, మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పండి. అలా మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అవ్వా తాతలకు ఇచ్చే పెన్షన్ రూ.3 వేలకు పెంచుకుంటూ పోతాడని ప్రతి అవ్వకూ చెప్పండి’.
నవరత్నాలు
నవరత్నాలు పథకాలు ప్రతి కుటుంబంలో మేలు చేస్తాయని చెప్పాలని, వాటిని ప్రతి ఇంటికి తీసుకుపోవాలని సూచించారు. ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి అవ్వ, ప్రతి తాతకు వాటి గురించి వివరించాలని కోరారు.
వ్యవస్థ మారాలి
ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలని, ఒక నాయకుడు ఏదైనా చేస్తానని చెప్పి, ఆ అంశాన్ని ప్రణాళికలో పెట్టి, ప్రజలను ఓటు అడిగి, ఓటు వేయించుకుని గెల్చిన తర్వాత, దాన్ని అమలు చేయకపోతే, ఆ పదవిని వీడి ఇంటికి పోవాలని, అప్పుడే ఈ రాజకీయాలలో నిజాయితీ, విశ్వసనీయత వస్తాయని స్పష్టం చేశారు. అందుకు అందరి సహకారం కావాలని కోరారు.
పార్టీ అభ్యర్థుల పరిచయం
గాజువాక నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తిప్పల నాగిరెడ్డితో పాటు, పార్టీ విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణను సభకు పరిచయం చేసిన శ్రీ వైయస్ జగన్, ఇద్దరినీ మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైయస్సార్సీపీ గుర్తు ఫ్యాన్‌ను కూడా సభకు చూపిన ఆయన, గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.
యాక్టర్–టీడీపీ
ఇక్కడ పోటీ ఒక యాక్టర్‌కు, ఒక లోకల్ హీరో మధ్య జరుగుతోందని చెప్పారు. గత 9 ఏళ్లుగా ఆ హీరో ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు.
ఇక ఆ యాక్టర్ ఇక్కడ నామినేషన్ వేస్తే, టీడీపీ జెండాలు కనిపించాయని, ఆయన నాలుగేళ్లు చంద్రబాబుతో కలిసి కాపురం చేశారని, ఇవాళ విడిపోయినట్లు కనిపిస్తున్నా.. లోపాయికారిగా కలిసి పని చేస్తున్నారని స్పష్టం చేశారు.
నాపై 22 కేసులు. మరి యాక్టర్‌పై ?
‘జగన్ అనే వ్యక్తి ఈ 5 ఏళ్లలో చంద్రబాబు మీద పోరాడితే ఏకంగా 22 కేసులు నమోదు చేశారు. అదే సమయంలో ప్రజల కోసం పోరాడుతున్నానని గత ఏడాదిగా ప్రచారం చేసుకుంటున్న ఆ యాక్టర్‌పై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అది ఆ రెండు పార్టీల మధ్య ఉన్న సయోధ్య’ అని శ్రీ వైయస్ జగన్ వివరించారు.
గంగవరం తరలింపు
గంగవరం పోర్టు వల్ల కాలుష్యానికి గురవుతున్న గ్రామాన్ని తరలించాలని 5 ఏళ్లుగా అడుగుతున్నా పట్టించుకోలేదన్న జననేత, ఒక అవకాశం ఇస్తే, ఆ గ్రామాన్ని తరలిస్తామని వెల్లడించారు.













