ధర్మాన వారసులపై వైసీపీ ఫోకస్.. శ్రీకాకుళంలో కొత్త చర్చ..
శ్రీకాకుళం (Srikakulam) జిల్లా వైసీపీ (YSR Congress Party) రాజకీయాల్లో ధర్మాన కుటుంబం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లూ సీనియర్ నేతలుగా రాజకీయాలను నడిపించిన ధర్మాన సోదరులు.. ఇప్పుడు తమ తర్వాతి తరాన్ని కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. దీంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మాన కుటుంబ వారసుల పాత్ర ఎలా ఉండబోతుందన్న ఆసక్తి నెలకొంది.
మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) తనయుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు (Dharmana Ram Manohar Naidu) శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంపై దృష్టి పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను పార్టీ అభ్యర్థిగా నిలబెట్టే అవకాశం ఉందనే ప్రచారం ఇప్పటికే మొదలైంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
మరోవైపు ధర్మాన కృష్ణదాస్ (Dharmana Krishna Das) తనయుడు కృష్ణ చైతన్య (Krishna Chaitanya) పేరు నరసన్నపేట (Narasannapeta) రాజకీయాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం తాజా మాజీ జెడ్పీటీసీగా ఉన్న ఆయన నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తండ్రి కృష్ణదాస్ కూడా గత కొంతకాలంగా పార్టీ సమావేశాల్లో కుమారుడిని క్యాడర్‌కు పరిచయం చేస్తూ వస్తున్నారనే చర్చ ఉంది. దీంతో ఆయనను భవిష్యత్ రాజకీయ వారసుడిగా సిద్ధం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి
ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు వైసీపీకి కీలకంగా మారాయి. క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని చూపించేందుకు సాధ్యమైనంత వరకు బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని అధిష్టానం భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో ధర్మాన కుటుంబం నుంచి ఎవరికైనా అవకాశం కల్పిస్తారా అన్న ప్రశ్న ఆసక్తిని పెంచుతోంది.
2021లో జరిగిన జడ్పీ ఎన్నికల సమయంలో కృష్ణ చైతన్యకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. అయితే అప్పటి రిజర్వేషన్ కారణంగా ఆ అవకాశం ముందుకు సాగలేదు. ఇప్పుడు రిజర్వేషన్ల పరిస్థితి మారే అవకాశం ఉండటంతో మరోసారి ఆయన పేరు తెరపైకి వచ్చింది. జడ్పీ చైర్మన్ పదవికి కుటుంబం నుంచి అభ్యర్థిని నిలబెట్టే అంశంపై వైసీపీలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇక శ్రీకాకుళం కార్పొరేషన్ (Srikakulam Municipal Corporation) ఎన్నికలపైనా రాజకీయ వర్గాల్లో ఆసక్తి ఉంది. గతంలో కార్పొరేషన్ మేయర్ పదవికి రామ్ మనోహర్ నాయుడు పేరు వినిపించింది. అప్పట్లో ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో ఆ అంశం అక్కడితో ఆగిపోయింది. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల అంశం మళ్లీ తెరపైకి రావడంతో ఆయనకు అవకాశం కల్పిస్తారా అన్న చర్చ మొదలైంది.
ఒకవైపు స్థానిక ఎన్నికలు.. మరోవైపు 2029 అసెంబ్లీ పోరు.. ఈ రెండు అంశాలు ధర్మాన కుటుంబ రాజకీయ వారసత్వానికి కీలకంగా మారుతున్నాయి. యువ నాయకులను ముందుకు తీసుకురావడం ద్వారా పార్టీ కార్యకలాపాల్లో కొత్త ఉత్సాహం తీసుకురావాలనే ఆలోచన ఉంటే, స్థానిక ఎన్నికలే అందుకు తొలి వేదిక కావచ్చనే చర్చ సాగుతోంది. అయితే రామ్ మనోహర్ నాయుడు, కృష్ణ చైతన్యలకు ఏ బాధ్యతలు అప్పగిస్తారు? ఏ ఎన్నికల్లో బరిలోకి దింపుతారు? అనేది పార్టీ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.







