వైసీపీకి తలనొప్పిగా మారిన నెల్లూరు పెద్దారెడ్లు!
ఎన్నికల సీజన్ కావడంతో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి. ఇలాంటి కప్పదాట్లతో పార్టీలు కూడా తలలు పట్టుకుంటున్నాయి. అయితే రాజకీయ పార్టీలకు ఇవన్నీ చాలా కామన్. ఎంతోమంది వస్తుంటారు.. పోతుంటారు.. ఇలాంటి వారి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే కొంతమంది నమ్మకస్తులు పార్టీని వీడితే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ల లోటును భర్తీ చేయడం కూడా అంత ఈజీ కాదు. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి ఇలాగే తయారైంది.
నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోటగా ఉంది. 2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఇక్కడ గణనీయమైన స్థానాలు సాధించింది. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఆ పార్టీ పది సీట్లూ గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఇందులో రెడ్డి సామాజిక వర్గం కీలక పాత్ర పోషించింది. కోటంరెడ్డి, మేకపాటి, కాకాణి, వేమిరెడ్డి కుటుంబాలు వైసీపీ విజయంలో గణనీయమైన పాత్ర పోషించాయి. అయితే ఇప్పుడు ఆ పార్టీలో అనేక ఇబ్బందులు తలెత్తాయి. నాడు పార్టీని భుజాలపై నడిపించిన వారే ఇప్పుడు అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే నడుస్తున్నారు. అయితే ఇటీవల వీళ్లిద్దరూ పార్టీకి దూరమయ్యారు. మొదటి నుంచి పార్టీలో ఉన్నా తమకు తగిన గౌరవం దక్కలేదనేది వారి ఆవేదన. పైగా వాళ్లపై కక్షగట్టినట్టు ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలతో వాళ్లిద్దరూ వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు. మరో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి గెలిచారు. అయితే తాజాగా ఆయన కూడా పార్టీకి దూరమయ్యారు. ఒకే జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు.. అది కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు దూరమవడం వైసీపీకి పెద్ద సమస్యగా మారింది. వీళ్లలో ఇద్దరు పార్టీకి నమ్మినబంట్లు.
తాజాగా రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీకి దూరమయ్యేందుకు సిద్ధమయ్యారు. వేమిరెడ్డి పదవీకాలం ముగుస్తుండడంతో ఆయనకు నెల్లూరు లోక్ సభ సీటు కేటాయించారు జగన్. అయితే అక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆయన సుముఖంగా లేరు. ఒకవేళ పోటీ తప్పదనుకుంటే తాను చెప్పినవాళ్లకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా నెల్లూరు సిటీ నుంతి తన భార్య, టీటీడీ పాలకమండలి సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిని నిలబెట్టాలని సూచించారు. అయితే వేమిరెడ్డి మాటను కాదని సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అనుచరుడు, డిప్యూటి మేయర్ ఖలీల్ కు సీటు ఖరారు చేశారు జగన్. ఈ విషయాన్ని కనీసం వేమిరెడ్డికి చెప్పలేదట. దీన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయారు వేమిరెడ్డి.
వైసీపీ కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ప్రధాన అనుచరులందరూ పార్టీకి దూరం కావడం కేడర్ ను కలవరానికి గురి చేస్తోంది. ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆర్థికంగా పార్టీకి ఎంతో సహాయపడ్డారు. అలాంటి వాళ్లు కూడా పార్టీకి దూరం కావడం జిల్లా యంత్రాంగం ఆశ్చర్యపోతోంది.













