ప్రకాశం బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్ల వెనుక కుట్ర..!?
భారీ వర్షాలు, వరదల ధాటికి ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలు పది రోజులుగా వరద నీటిలోనే ఉంటున్నాయి. బంగాళాఖాతంలో వరుస వాయుగుండాల ప్రభావం వల్ల ఇప్పటికీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కోస్తాంధ్రలో ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల ధాటికి ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ వద్ద వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దాదాపు 15 రోజులుగా అన్ని గేట్లూ ఎత్తేసి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇటీవల వరదల్లో ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకొచ్చాయి. అయితే వీటి వెనుక కుట్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఓ వైపు కృష్ణానది, మరోవైపు బుడమేరు నుంచి వచ్చిన భారీ వరదల ధాటికి ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద పోటెత్తుతోంది. ఈ సమయంలో మూడు బోట్లు బ్యారేజీకి కొట్టుకొచ్చాయి. ఇవన్నీ ఇసుక బోట్లు అని అధికారులు గుర్తించారు. బోట్లన్నీ వైసీపీ రంగుల్లో ఉండడం, వరదల సమయంలో బోట్లను సురక్షితంగా లంగరు వేయకుండా వదిలేయడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. బోట్లు కొట్టుకురావడంపై విచారణ మొదలుపెట్టిన అధికారులకు ఈ బోట్లు వైసీపీ అనుచరులవిగా గుర్తించారు. వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరుడైన ఉషాద్రి ఈ బోట్ల యజమాని అని గుర్తించారు. వీటిని విడివిడిగా కాకుండా ఒకదానికొకటి కట్టేసి ఉండడం పలు అనుమానాలకు తావిచ్చింది.
ఉధృతమైన వరద సమయంలో బోట్లను వదిలేయడం ద్వారా ప్రకాశం బ్యారేజీకి డ్యామేజీ కలిగించవచ్చని.. అది జరిగితే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంతోనే బోట్లను ఇలా వదిలేశారని టీడీపీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై లోతుగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై కేసు నమోదు చేసిన పోలీసులు ఉషాద్రి రామ్మోహన్ ను అరెస్టు చేశారు. మామూలుగా ఈ బోట్లు ఉద్దండరాయుని పాలెం వైపు ఉంటాయి. అయితే వరదలకు ముందు ఈ బోట్లను గొల్లపూడి వైపు తీసుకొచ్చి లంగరు వేశారు. ఇది మరిన్ని అనుమానాలకు తావిస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఇలాంటి వరదల సమయంలో చిన్న వస్తువు కూడా కొట్టుకుపోతుందేమోనని భద్రపరుచుకుంటామని.. అలాంటిది కోట్ల విలువ చేసే బోట్లను అలా గాలికొదిలేయడంపై అనుమానాలున్నాయని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు.
అయితే ఉషాద్రి రామ్మోహన్ మంత్రి నారా లోకేశ్ కు అత్యంత సన్నిహితుడని వైసీపీ ట్వీట్ చేసింది. టీడీపీ ఎన్నారై విభాగం అధ్యక్షుడు కోమటి జయరాంకు రామ్మోహన్ సమీప బంధువు అని వెల్లడించింది. రామ్మోహన్ గతంలో నారా లోకేశ్ ను కలిసిన ఫోటోను కూడా వైసీపీ జతచేసింది. వరదల నుంచి జనాగ్రహాన్ని మళ్లించేందుకు టీడీపీ ఇలాంటి జిత్తుల మారి వేషాలు వేస్తోందని విమర్శించింది. మొత్తానికి బోట్ల వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. వీటిని బలంగా ఎందుకు లంగరు వేయలేదు.. గొల్లపూడి వైపు ఇవి ఎందుకొచ్చాయి.. మూడింటినీ ఒకదానికొకటి ఎందుకు కట్టేశారు.. లాంటి అంశాలు విచారణలో తేలాల్సి ఉంది.













