సీఎం చంద్రబాబుతో ప్రపంచబ్యాంకు ప్రతినిధుల బృందం భేటీ
రాజధాని అమరావతిలో మూడు రోజుల పర్యటనకు వచ్చిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యింది. ఉత్తమ విధానాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చంద్రబాబు వారితో పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రుణ సహకారంపై వారి మధ్య చర్చ జరిగింది. ప్రపంచ బ్యాంకు సీనియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెషలిస్ట్ రఘు కేశవన్, లీడ్ ట్రాన్స్పోర్ట్ స్పెషలిస్ట్ గెరాల్డ్ పాల్ అలీలవియర్, సీనియర్ అర్బన్ స్పెషలిస్ట్ కింగ్ యున్ షెన్, దక్షిణాసియా అర్బన్ ప్రాక్టీస్ మేనేజర్ అబేదాలి రజాక్ ఎఫ్. ఖలీల్లతో కూడిన నలుగురు సభ్యుల ప్రతినిధుల బృందం అమరావతిలో పర్యటించిన సంగతి తెలిసిందే.
2019కి ముందు అమరావతి నిర్మాణానికి ఏఐఐబీతో కలసి రూ.3,500 కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు సంసిద్ధత తెలిపింది. అప్పట్లోనూ ఈ ప్రాజెక్టులో రఘు కేశవన్ క్రియాశీలకంగా వ్యవహరించారు. రుణం మంజూరుపై గతంలో నిలిచిపోయిన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకే ఈ బృందం ఇక్కడికి వచ్చినట్లు సమాచారం. ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఏకే సింఘాల్, సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ పాల్గొన్నారు.













