సీఎం చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
తిరుమలలో మహా సంప్రోక్షణ సమయంలో భక్తులను అనుమతించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. చాతుర్మాస దీక్షలో భాగంగా హృషికేశ్లో ఉన్న స్వరూపానంద వీడియో సందేశం ద్వారా మాట్లాడుతూ మహా సంప్రోక్షణ సందర్భంగా స్వామివారి దర్శనానికి భక్తులను పూర్తిగా అనుమతించరాదన్న టీటీడీ పాలకమండలి నిర్ణయం సరికాదని అన్నారు. దేవాలయ వ్యవస్థను ప్రభుత్వ వ్యవస్థగా చూడొద్దని తెలిపారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆగమశాస్త్ర పండితులు, అర్చక స్వాములతో చర్చించకుండా పాలక మండలి వ్యవహరించిన తీరు సరికాదన్నారు. దేవాలయాల వైదిక కార్యక్రమాల్లో పాలకమండళ్లు జోక్యం చేసుకుని భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే విధంగా నిర్ణయాలు తీసుకోరాదన్నారు.













