మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు ఇక లేరు
సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు (Satrucharla Vijayarama Raju) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రి (Apollo Hospital)లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1948 ఆగస్టు 4న జన్మించిన శత్రుచర్ల విజయరామరాజు చినమేరంగి సంస్థాన కుటుంబానికి చెందినవారు.
1978లో నాగూరు నియోజకవర్గం నుంచి జనతా పార్టీ (Janata Party) తరఫున తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1983, 1985 ఎన్నికల్లోనూ వరుస విజయాలు సాధించారు. 1989, 1991లో పార్వతీపురం లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి 1998లో మూడోసారి లోక్సభకు ఎన్నికయ్యారు. తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి 1999లో నాగూరు నుంచి, 2004లో పార్వతీపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో అటవీ, పర్యావరణ శాఖల మంత్రిగా, ఆ తర్వాత ముఖ్యమంత్రి కె. రోశయ్య మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2014 మార్చిలో టీడీపీలో తిరిగి చేరిన ఆయన, 2017 మార్చిలో శ్రీకాకుళం స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై 2023 వరకు ఆ పదవిలో కొనసాగేశారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.







