తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నదే తన ఆకాంక్ష : వెంకయ్య
తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నదే తన ఆకాంక్ష అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున నిర్వహించిన పౌర సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలహించుకోకుండా కలిసి మెలిసి పనిచేయాలని అన్నారు. తెలుగు భాషను పరిరక్షించాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. రాజ్యాంగబద్ద పదవిని అలంకరించిన తర్వాత అడుగుపెట్టిన తనకు అపూర్వ స్వాగతం లభించడం తనకు సంతోషంగా ఉందన్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తాను ఆ పదవి స్థాయిని పెంచేందుకు కృషి చేస్తానని అన్నారు. నేను రాజకీయాల నుంచి రిటైర్డ్ అయినప్పటికీ ఐయామ్ నాట్ టైర్డ్ అంటూ తన వాగ్దాటిని మరోసారి చాటారు. ఆకలి, విద్య అసమానతలు తొలిగినప్పుడే దేశం అభివృద్ధి చెందినట్లు అన్నారు.
2020 తర్వాత ప్రజల్లో ఉండాలన్నదే తన కోరిక అని, కానీ అది తీరలేదని చెప్పారు. 2019లో బీజేపీని గెలిపించాక పార్లమెంట్ సభ్యుడిగా రాజీనామా చేసి 2020 సంక్రాంతికి ఇంటికెళ్లి పండగ జరుపుకోవాలని అనుకున్నాని చెప్పారు. ఆ తర్వాత సమాజ సేవలో ఉండాలన్నదే తన కోరిక అని చెప్పారు. ఈ విషయాన్ని తన భార్యకు ఎప్పుడో చెప్పానని అన్నారు. ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యాక ఆ కోరిక తీరే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఏ పదవిలో ఉన్నా తెలుగువారికి చేయాల్సింది చేస్తానని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిలిద్దరూ కలిసే ఉండాలని అన్నారు. తెలుగును పరిపాలనా భాషగా మార్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. రాజకీయాలలో తాను దశాబ్దాల పాటు చిత్తశుద్ధితో నమ్మిన సిద్దాంతానికి కట్టుబడి పని చేశానన్నారు. అదే విధంగా ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్ గా తన విధులను చిత్తశుద్ధిగా నిర్వహిస్తానన్నారు. రాజ్యసభలో అర్ధవంతమైన చర్చలు జరిగేలా ప్రయత్నిస్తానని చెప్పారు.













