విజయవాడ నుంచి సింగపూర్ కు విమాన సర్వీసు ప్రారంభం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలకతీతంగా కలిసి పనిచేస్తే వేగవంతమైన అభివృద్ధిని చూడగలమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. గన్నవరం విమానాశ్రయంలో రూ.611 కోట్లతో నిర్మిస్తున్న నూతన ప్యాసింజర్ టెర్నినల్ భవనానికి భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. విజయవాడ నుంచి సింగపూర్‌కు తొలి అంతర్జాతీయ విమానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందితే రాష్ట్రాలు కూడా అందులో భాగమవుతాయని తెలిపారు. సింగపూర్‌కు తొలి అంతర్జాతీయ సర్వీసును ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. గన్నవరం విమానాశ్రయం రానున్న రోజుల్లో మరిన్ని అంతర్జాతీయ సర్వీసులతో కళకళలాడే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. ఇప్పటివరకూ విమానాశ్రయంలో ఉన్న సౌకర్యాలకు అదనంగా 35 వేల చదరపు మీటర్ల పరిధిలో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ టెర్నినల్‌కు పర్యావరణహితంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. కాగా రూ.611 కోట్ల వ్యయంతో టెర్నినల్ బిల్డింగ్‌కు అనుమతులు ఇచ్చామని పౌర విమానయాన మంత్రి సురేశ్ ప్రభు చెప్పారు. ఇది పూర్తయితే రాష్ట్రానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు.













