2019లో మోడీయే ప్రధాని కావాలనేది నా కోరిక
2019లో కూడా నరేంద్ర మోడీయే ప్రధాని కావాలనేది నా కోరిక అని ఎన్డిఎ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. విజయవాడలో వెంకయ్యనాయుడుకు ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వెంకయ్య మాట్లాడుతూ భారత శక్తి ఏమిటో ప్రధాని మోదీ ప్రపంచానికి తెలియజెప్పారని అన్నారు. జీవితంలో క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. దీర్ఘకాలిక సుఖాల కోసం స్వల్పకాలిక కష్టాలు తప్పవన్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి చర్యలు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించేవేనని సృష్టం చేశారు. రాజకీయాల నుంచి తనను కొందరు తప్పించారనడం తప్పుడు ప్రచారమని అన్నారు. మోదీ మళ్లీ ప్రధాని అయ్యాక తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావించినట్లు పేర్కొన్నారు. రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగాను అని అన్నారు. తన కుమారుడు, కుమార్తె, అల్లుడి వ్యాపారంలో తాను జోక్యం చేసుకోలేదని, స్వర్ణభారత్ ట్రస్టు ప్రభుత్వం నుంచి ఎప్పుడూ నిధులు తీసుకోలేదని చెప్పారు. నాకు ఉపరాష్ట్రపతి పదవీ వస్తుందని ఊహించలేదన్నారు. నన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం పార్టీ నిర్ణయమని తెలిపారు.













