శ్రీసిటీని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
– అధ్యయనానికి గ్లోబల్ మోడల్ శ్రీసిటీ అంటూ ప్రశంస
– ఈ ప్రాంత పర్యావరణ, ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధికి హామీ
ప్రపంచవ్యాప్తంగా అధ్యయనానికి అత్యంత ఆదర్శమైన పారిశ్రామికవాడ శ్రీసిటీ అంటూ కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖామాత్యులు జి.కిషన్ రెడ్డి ప్రశంసించారు. మంగళవారం ఉదయం శ్రీసిటీ పర్యటనకు విచ్చేసిన ఆయనకు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా స్థానిక బిజినెస్ సెంటర్ లో శ్రీసిటీ పరిశ్రమల సీఈఓ ల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, దేశంలో అద్భుతమైన రవాణా మౌళిక సదుపాయాల నిర్మాణానికి భారత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ప్రాతిపదికన పెట్టుబడి పెడుతోందన్న ఆయన, చక్కని మౌళిక సదుపాయాలు, పెట్టుబడుల అనుకూల వాతావరణంతో కూడిన ప్రణాళికాబద్ధమైన పారిశ్రామిక కేంద్రం శ్రీసిటీ ప్రగతి తనను ఆశ్చర్యానికి గురిచేస్తోందని అన్నారు. దేశంలోని 10 ఉత్తమ పెట్టుబడుల గమ్యస్థానాలలో ఒకటిగా అవతరించిన శ్రీసిటీ, ప్రధాని మోడీ సారథ్యంలోని ‘సులభతర వ్యాపారం’ పెంపు లక్ష్యంతో రూపుదిద్దుకుంటున్న ‘న్యూ ఇండియా’కు ప్రాతినిధ్యం వహిస్తుందని పేర్కొన్నారు.
భారీ ఉద్యోగాల కల్పనకు శ్రీసిటీ చేస్తున్న కృషిని అభినందించిన కిషన్ రెడ్డి, మెట్రో కోచ్లు, ఆటోమొబైల్స్, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఎఫ్ఎంసిజి, ఫుడ్ ప్రాసెసింగ్, ఎయిర్ కండిషనర్లు, ఎలక్ట్రానిక్స్, ఫార్ములేషన్స్ తదితర వివిధ రంగాల తయారీ పరిశ్రమలకు శ్రీసిటీ నిలయంగా మారిందని ప్రశంసించారు. వెనుకబడిన ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉపాధిని సృష్టించి, బంజరు భూమిని శక్తివంతమైన ఆర్థిక కేంద్రంగా మార్చిన ఘనత శ్రీసిటీది అన్నారు. ఇక్కడ శ్రామిక శక్తిలో 50 శాతం మహిళలు కావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆయన, పలు ప్రత్యేక లక్షణాలు కలిగిన శ్రీసిటీ, ఖచ్చితంగా ప్రపంచ స్థాయిలో ఒక మంచి ‘కేస్ స్టడీ’ అవుతుందన్నారు. ఈ నమూనాను ఇప్పటికే దేశంలోని ఇతర పలు ప్రాంతాలలో అనుసరిస్తున్నట్లు చెప్పారు.
ఇక్కడ అమలు చేస్తున్న స్థిరమైన పర్యావరణ చర్యల కారణంగా శ్రీసిటీ ప్రాంతంలో పర్యావరణ, ఆధ్యాత్మిక పర్యాటకానికి మంచి అవకాశాలు ఉన్నాయని, తన మంత్రిత్వ శాఖ తరపున దీని మరింత అభివృద్ధికి అన్నిరకాల మద్దతును అందిస్తానని హామీ ఇచ్చారు.
మంత్రి పర్యటన తమకెంతో విలువైనదని వ్యాఖ్యానించిన రవీంద్ర సన్నారెడ్డి, శ్రీసిటీని సందర్శించినందుకు తమ పారిశ్రామిక కుటుంబం తరపున మంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు. మంత్రి అభిప్రాయాలు, సానుకూల స్పందన తమకు అత్యంత ప్రోత్సాహకరం, స్ఫూర్తిదాయకం అన్నారు.
పర్యటనలో భాగంగా కిషన్ రెడ్డి శ్రీసిటీ పరిసరాలు వీక్షించడంతో పాటు బ్లూస్టార్ పరిశ్రమను సందర్శించారు. పరిశ్రమ ఉత్పత్తులు పరిశీలించి, అక్కడ ఉద్యోగులతో కొద్దిసేపు ముచ్చటించారు.













