తిరుమల వెళ్తున్నారా…? ఇవి తెలుసుకోండి..!
కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. మొదటి వేవ్ తో పోల్చితే రెండో వేవ్ లో వైరస్ చాలా వేగంగా విస్తరిస్తోంది. వచ్చే రెండు నెలలపాటు వైరస్ తీవ్రత మరింత అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎలాంటి లక్షణాలు లేని వ్యక్తుల్లో కూడా కరోనా పాజిటివ్ రిపోర్టులు వస్తున్నాయి. దీంతో ఇది చాపకింద నీరులా శరవేగంగా విస్తరిస్తోంది. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో కూడా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో టీటీడీ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది.
తిరుమలకు వెళ్లే భక్తులకు అలిపిరి వద్దే చెక్ పెడుతోంది టీటీడీ. శ్రీవారి దర్శనం టికెట్లు ఉన్నవారిని మాత్రమే కొండపైకి పంపిస్తోంది. టికెట్లు ఉన్న భక్తులు కూడా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లడానికి వీల్లేదు. వాహనాల్లో వచ్చే భక్తులు ముందురోజు మధ్యాహ్నం నుంచి కొండెక్కడానికి వీలుంటుంది. నడకదారి భక్తులను ముందురోజు ఉదయం 9 గంటల తర్వాత అనుమతిస్తారు. టికెట్లు లేని వారికి తిరుమల వెళ్లేందుకు వీలుండదు. కాబట్టి భక్తులు సహకరించాలని.. టికెట్లు లేని భక్తులు తిరుమల రావొద్దని టీటీడీ స్పష్టం చేసింది.
జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు ఉంటే తిరుమల రావొద్దని టీటీడీ సూచించింది. తిరుమలకు వచ్చి భక్తులకు ఇబ్బంది కలిగించవద్దని కోరింది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎవరైనా భక్తులు ఇప్పటికే దర్శనం లేదా ఇతర సేవల టికెట్లు పొంది అనారోగ్యంతో ఉంటే అలాంటి వాళ్లు తమ షెడ్యూల్ వాయిదా వేసుకోవాలని కోరింది. అవసరమైతే అలాంటివారికి దర్శనం లేదా సేవలను రీషెడ్యూల్ చేస్తామని వెల్లడించింది. అలాగే ఉగాది నుంచి పునరుద్ధరించాలనుకున్న ఆర్జిత సేవలపైన కూడా టీటీడీ పునరాలోచనలో పడింది. ఈ నెల 14 తర్వాత ఆర్జిత సేవలపై నిర్ణయం తీసుకోనుంది.
మరోవైపు దర్శనాల సంఖ్యను కూడా టీటీడీ కుదించింది. లాక్ డౌన్ తర్వాత దశలవారీగా దర్శనాల సంఖ్యను పెంచుతూ వచ్చింది టీటీడీ. అయితే ఇప్పడు మళ్లీ కేసులు పెరుగుతూ ఉండడంతో దర్శనాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రోజువారీ దర్శనాలను 45వేలకు కుదించింది. అలాగే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని రద్దు చేసే యోచనలో ఉంది. అలాగే సర్వదర్శనం టోకెన్లను కూడా 15వేలకు మించి ఇవ్వకూడదని నిర్ణయించింది. తిరుమల వచ్చే భక్తులు తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలి. మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. భక్తులు తమవెంట శానిటైజర్లను తెచ్చుకోవాలని కోరింది టీటీడీ. తిరుమల వసతి గదుల్లో ఇద్దరికి మించి ఉండరాదని ఆదేశించింది. కాబట్టి తిరుమల వెళ్లే భక్తులు ఈ కొత్త నిబంధనలు తెలుసుకుని వెళ్తే బెటర్.













