దొనకొండ వద్దు…తిరుపతిని చేయండి
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తిరుపతిని ప్రకటించాలని మాజీ ఎంపీ చింతా మోహన్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి సూచించారు.రాజధాని అమరావతి నుంచి దొనకొండకు మారనుందని దీనిపై కేంద్రంలోని పెద్దల నుంచి తనకు సమాచారముందని తెలిపారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి సౌకర్యాలు లేని దొనకొండ కంటే తిరుపతి కొండ అయితే రాజధానికి బాగుంటుందని అన్నారు. రాజధాని మార్పుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రంతో మాట్లాడినట్లు తెలిసిందన్నారు. దొనకొండ విషయంలో తొందరపడొద్దని సీఎం జగన్‌కు ఆయన సూచించారు. అక్కడ జలవనరులు, రైల్వే, రవాణా సౌకర్యాలు లేవని చెప్పారు. తిరుపతి కాకుండా రాజధానిగా ఇంకా ఏ ప్రాంతమైనా నిలబడదన్నారు. తిరుపతిని రాజధాని చేయాలని 2013లోనే తాను నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు లేఖ రాసినట్లు గుర్తు చేశారు.













