AP Politics: టికెట్ ఆశలు, గెలుపు గందరగోళం..రాజకీయ వారసుల పరిస్థితి ఏమిటో?

రాజకీయాల్లో ఒక కుటుంబానికి వారసుడు అయినంత మాత్రాన కచ్చితంగా ఎన్నికల్లో గెలుస్తారు అన్న నమ్మకం లేదు. కానీ రాజకీయంలోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు తమ వారసులని సెటిల్ చేయాలి అన్న ఉద్దేశంతోనే ఉంటారు. నేటి యువ రాజకీయవారసుల తీరు చూస్తే, వీరి లక్ష్యం మొత్తం 2029లో జరగబోయే ఎన్నికలపై కేంద్రీకృతమై ఉన్నట్లు తెలుస్తోంది. చాలామంది గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం పని చేస్తున్నప్పటికీ తమకు పోటీ చేసే ఛాన్స్ ఎప్పుడు వస్తుంది? వస్తే కచ్చితంగా గెలుస్తామా లేదా అన్న విషయంపై సందిగ్ధతతో ఉన్నారు. అటు క్యాడర్ కూడా వారసుల్ని బరిలోకి దింపడానికి కాస్త ఆలోచిస్తుంది.
ఉదాహరణకు అనంతపురం (Anantapur) జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశించిన పరిటాల శ్రీరాం (Paritala Sreeram), టికెట్ దక్కకుండానే మిగిలిపోయారు. తండ్రి పరిటాల రవి వంటి బలమైన నేపథ్యం ఉన్నా, పార్టీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి హామీ రాలేదట. ఇక కృష్ణా జిల్లా (Krishna District) నుంచి వంశపారంపర్యంగా వచ్చిన దేవినేని అవినాష్ (Devineni Avinash) కూడా గత ఎన్నికల్లో విజయవాడ తూర్పు (Vijayawada East) నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయనపై రాజకీయంగా ఐరెన్ లెగ్ అన్న మాట కూడా వినిపిస్తుంది.
ఇక నెల్లూరు జిల్లా (Nellore District) రాజకీయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన నేదురుమల్లి కుటుంబానికి చెందిన రాం కుమార్ రెడ్డి (Nedurumalli Ram Kumar Reddy), వెంకటగిరి (Venkatagiri) నియోజకవర్గం నుంచి గెలుపు ఆశించి కూడా ఓడిపోయారు. ప్రజల్లో గుర్తింపు ఉన్నా, విజయం అందుకోవడంలో ఇంకా వెనుకబడినట్టు తెలుస్తోంది. పార్టీ తిరిగి ఆయనకు టికెట్ ఇస్తుందా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు.
రాజాం (Rajam) నియోజకవర్గానికి చెందిన కావలి గ్రీష్మ (Kavali Greeshma), మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి కుమార్తె. గతంలో టికెట్ ఆశించినా, రాజకీయ పరిస్థితుల కారణంగా దక్కలేదు. ప్రస్తుతం మండలిలో ఉన్నా, ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం వస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఇక విజయవాడకు చెందిన వంగవీటి రాధా (Vangaveeti Radha), 2004లో ఒక్కసారి విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత పదవులు దక్కలేదు. 2024లో టికెట్ కూడా రాలేదు. ప్రస్తుతం టీడీపీ (TDP) నుంచి నిష్క్రమణపై ఆలోచిస్తున్నారట. ఆయన తదుపరి అడుగు ఏ పార్టీ దిశగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.ఇలా చూస్తే, రాజకీయ వారసత్వం ఉన్నవారికి కూడా ఎన్నికల్లో గెలుపు గ్యారంటీ కాదన్న విషయం మరోసారి స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో 2029 ఎన్నికలు వీరి రాజకీయ భవిష్యత్తుకు కీలకంగా మారబోతున్నాయి.