Pawan Kalyan: ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సారథ్యంలో పిఠాపురం అభివృద్ధి : పవన్ కల్యాణ్
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi, ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) సారథ్యంలో పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకువెళ్తోందని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. పిఠాపురం నియోజకవర్గం(Pithapuram Constituency) లో రూ.100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. రైతులకు వ్యవసాయ పనిముట్లు, మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. పిఠాపురంలో 100 పడకల ఆస్పత్రికి పునాదిరాయి వేశారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నాయకులమంతా సమన్వయంతో ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి పని చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలో పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేశామన్నారు. 30 పడకల ఆస్పత్రిని 100 పడకలకు పెంచుతున్నట్లు తెలిపారు. సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా పార్టీతో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.













