Satyakumar: ఇది క్షమించరాని నేరం.. బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందే : మంత్రి సత్యకుమార్
మద్యం కుంభకోణం ద్వారా ప్రపంచం విస్తుపోయేలా వైసీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Satyakumar Yadav) ఆరోపించారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం (International Nurses Day) సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన సదస్సులో సత్యకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రే స్వయంగా డిస్టిలరీలు (Distilleries) పెట్టడం, సొంత బ్రాండ్లు తయారు చేయించడం లాంటి విడ్డూరం ప్రపంచంలో ఎక్కడా చూడలేదన్నారు. మద్యం కుంభకోణంలో రూ.వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. 2014-19 మధ్య కాలంలో 49 వేల కిడ్నీ కేసులు (Kidney cases) నమోదైతే, 2019-2024 మధ్య 91 వేలకు పెరిగాయన్నారు. కాలేయ సమస్యలకు సంబంధించిన కేసులు సైతం భారీగా పెరిగినట్లు తెలిపారు. న్యూరో సంబంధిత కేసులు 380 నుంచి 7,800కి పెరిగినట్లు తెలిపారు. గత ప్రభుత్వ నేతలు నాణ్యతలేని మద్యం తయారు చేయించి లక్షల మంది ప్రాణాలతో చెలగాటమాడారని విమర్శించారు. ఇది క్షమించరాని నేరమని, బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిన అవసరముందన్నారు.













