Mahanadu: కడప గడ్డపై రేపటి నుంచే మహనాడు.. సత్తా చాటేందుకు సిద్ధమైన టీడీపీ
కడపలో (Kadapa) రేపటి నుంచి జరగనున్న తెలుగుదేశం పార్టీ (TDP) మహానాడుకు (Mahanadu) ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. రాయలసీమ (Rayalaseema) గడ్డపై జరగనున్న ఈ సభ రాజకీయంగా, సంస్థాగతంగా టీడీపీకి కీలకమైన ఘట్టంగా నిలుస్తుంది. కడప శివారులోని పబ్బాపురంలో మహానాడు వేదిక సిద్ధమైంది. రేపటి నుంచి మూడు రోజులపాటు జరిగే మహానాడులో పలు కీలక తీర్మానాలను టీడీపీ ఆమోదించనుంది. చివరి రోజు భారీ బహిరంగ సభ ద్వారా కడప గడ్డపై సత్తా చాటేందుకు టీడీపీ సిద్ధమైంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లలో మహానాడు నిర్వహించడం ద్వారా టీడీపీ రాజకీయంగా పైచేయి సాధించాలని భావిస్తోంది.
మహానాడులో ఎన్టీఆర్ (NTR) శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఇది కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపనుంది. మహానాడు కోసం పబ్బాపురం వద్ద 50 ఎకరాల స్థలంలో భారీ పందిరి, అత్యాధునిక సౌండ్ సిస్టమ్, సీసీటీవీ కెమెరాలు, ఎల్ఈడీ స్క్రీన్లు అమర్చారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే లక్షలాది కార్యకర్తలు, నాయకుల కోసం వసతి, భోజన సౌకర్యాలు సిద్ధం చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక బృందాలు, భద్రతకు 2,000 మంది పోలీసులు ఏర్పాటు చేశారు. మే 27, 28 తేదీల్లో ప్రతినిధుల సమావేశాలు, 29న బహిరంగ సభతో కార్యక్రమం ముగుస్తుంది.
ఈ సారి మహానాడు కడపలో జరగడం ఒక ప్రత్యేకత. రాయలసీమ నడిబొడ్డున మహానాడు నిర్వహించడం ద్వారా టీడీపీ ఈ ప్రాంతంలో తన బలాన్ని చాటనుంది. 2024 ఎన్నికల్లో కడప జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాల్లో 7 చోట్ల టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయం సాధించింది. ఇది పార్టీకి ఊపునిచ్చింది. మహానాడు వేదికగా టీడీపీ తన సూపర్-6 పథకాల అమలుపై చర్చిస్తుంది. రాష్ట్ర ఆర్థిక స్థితిని సమీక్షిస్తూ, వైసీపీ హయాంలో చేసిన అప్పుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించే వ్యూహాలపై చర్చ జరుగనుంది. అలాగే, స్థానిక సంస్థల ఎన్నికల కోసం కార్యకర్తలను సన్నద్ధం చేయడం, యువత, మహిళలను ఆకర్షించే కార్యక్రమాలపై దృష్టి సారించనున్నారు.
మహానాడు తర్వాత టీడీపీలో సంస్థాగత మార్పులు జరిగే అవకాశం ఉంది. పార్టీ సభ్యత్వం 1.2 కోట్లు దాటడంతో, స్థానిక సంస్థల నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల ఏర్పాటుపై చర్చ జరుగనుంది. చంద్రబాబు (Chandrababu) ఆదేశాల మేరకు, ప్రతి శనివారం నియోజకవర్గ స్థాయిలో ప్రజా దర్బార్ నిర్వహించి, ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయనున్నారు. యువ నాయకులు, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పార్టీ ఆధునీకరణకు కృషి చేస్తారు. రాయలసీమలో పార్టీ బలోపేతం కోసం కొత్త వ్యూహాలు, స్థానిక నాయకుల పాత్రను పెంచే ప్రణాళికలు రూపొందనున్నాయి.
అన్నిటికీ మించి మహానాడులో యువనేత నారా లోకేశ్ (Nara Lokesh) కు కీలక బాధ్యతలు అప్పగించవచ్చనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం లోకేశ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదోన్నతి లభించవచ్చని సమాచారం. పార్టీ కేడర్ కూడా ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేస్తోంది. పలు నియోజకవర్గాల మినీ మహానాడుల్లో ఈ మేరకు తీర్మానాలు కూడా చేశారు. అధినేత చంద్రబాబు ప్రభుత్వ బాధ్యతల్లో తలమునకలై ఉన్నందున పార్టీ బాధ్యతలను లోకేశ్ కు అప్పగించాలని పలువురు నేతలు సూచిస్తున్నారు. మహానాడులో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.













