అమరావతిలో టీడీపీ నేతల బృందం పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై తప్పుగా మాట్లాడినట్లు మంత్రి బొత్స ఒప్పుకోవాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. అచ్చెన్నాయుడు నేతృత్వంలో టీడీపీ నేతల బృందం అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాజధానిలో ఒక్కరాయి కూడా వేయలేదంటూ అవాస్తవాలు మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నారు. ఇక్కడ 12 టవర్లతో 288 క్వార్టర్ల నిర్మాణం జరిగిందని అన్నారు. రాజధానిపై వైకాపా నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఇక్కడికి వస్తే ఎన్ని భవనాలు ఉన్నాయో వాళ్లకు చూపిస్తామని అన్నారు. అమరావతి పేరు చెబితే చంద్రబాబు గుర్తొస్తారని వైకాపా నాయకులకు తెలుసని అందుకే రాజధానిని నీరుగార్చే పనిలో పడ్డారని ఆరోపించారు. అమరావతి గ్రాఫిక్స్ అని ఊరికే చెప్పడం కాదు.. ఇక్కడ నిర్మాణాలు చూసి మాట్లాడాలి అని మండిపడ్డారు. పేదలకు 5వేల గృహాలు నిర్మిస్తే అసలు గృహాలే ఇవ్వలేదని బొత్స చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.













