ఆ విషయం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇంకా మరువలేదు
రాష్ట్రంలో విళయ తాండవం చేస్తున్న కరవు నివారణ చర్యలను తీసుకోవడంలో జగన్ ప్రభుత్వం పూర్తి విఫలమైందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శించారు. గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ విత్తనాలు అందక, సమయానికి సాగునీరు రాక, కరెంటు కోతలతో రాష్ట్ర రైతాంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి తరుణంలో వారి సమస్యలను పట్టించుకోకుండా వైఎస్ జయంతిని పురస్కరించుకొని పాలకులు రైతు దినోత్సవ వేడుకలను జరుపుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్ రాజన్న రాజ్యం తెస్తామని పదే పదే చెబుతోంటే ప్రలు హడలెత్తి పోతున్నారని అన్నారు
గత వైఎస్ ప్రభుత్వ హయాంలో 14 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇంకా మరువలేదన్నారు. వ్వవసాయం పట్ల పాలకుల నిర్లక్ష్యానికి గత ఐదేళ్లుగా లేనటువంటి రైతు ఆత్మహత్యలు మళ్లీ మొదలయ్యాయని, సీఎం నివాసానికి కూత వేటు దూరంలో కౌలు రైతు మరణించినా పట్టించుకోకుండా రైతు దినోత్సవ వేడుకలను జరుపుకోవడం సిగ్గుచేటని తెలిపారు. రైతు భరోసా క్రింద రూ.12,500 ఇస్తామని చెబుతున్న జగన్ అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాటాలు ఎంతో ప్రజలకు చెబితే బాగుంటుందని తెలిపారు.













