సీఎస్ అంటే చీఫ్ సెక్రటరీ కాదు… చెవిరెడ్డి సెక్రటరీ
ఏపీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై టీడీపీ మహిళ నేత పంచుమర్తి అనురాధ తీవ్ర విమర్శలు గుప్పించారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎస్ అంటే చీఫ్ సెక్రటరీ కానీ…చెవిరెడ్డి సెక్రటరీగా మారిపోతారని అనుకోలేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విడతల వారీగా రీపోలింగ్ ఏపీలోనే చూస్తున్నామని చెప్పారు. అయినా చెవిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేయకుండా.. సీఎస్‌కు ఎందుకు ఫిర్యాదు చేశారని అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీ ఇచ్చిన ఫిర్యాదులను పట్టించుకోని ఈసీ వైసీపీ వాళ్ళు ఫిర్యాదు ఇచ్చిన వెంటనే చర్యలకు దిగుతోందన్నారు. టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుపై కూడా వెంటనే ఈసీ రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. జాతిపిత మహాత్మాగాంధీని బీజేపీ అవమానించిందని ఆరోపించారు. ప్రజ్ఞాసింగ్‌పై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణించడమేంటి? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.













