రాష్ట్రంలో ఏ వ్యవస్థలను సీఎం జగన్ వదలడం లేదు.. చివరికి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ ముఖ్యమంత్రి జగన్ వదలడం లేదని, చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. భీమ్లానాయక్ సినిమా విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపై మండిపడ్డారు. సినిమా పరిశ్రమపై ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరును తప్పుపట్టారు. భీమ్లానాయక్ సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తోన్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తోందన్నారు. వ్యక్తులను టార్గెట్గా పెట్టుకుని వ్యవస్థలను నావనం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.
భారతీ సిమెంట్ ధరపై లేని నియంత్రణ భీమ్లానాయక్ సినిమాపై ఎందుకు? అని ప్రశ్నించారు. ప్రపంచస్థాయికి వెళ్లిన తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రంలో వేధిస్తోన్న జగన్ తన మూర్ఖపు వైఖరి వీడాలన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు అన్నీ పక్కన పెట్టి, థియేటర్ల దగ్గర రెవెన్యూ ఉద్యోగులను కాపలా పెట్టిన ప్రభుత్వ తీరు తీవ్ర అభ్యంతరకరం అన్నారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న తమవారిని రక్షించేందుకు దేశంలో అన్ని రాష్ట్రాలు ప్రయత్నం చేస్తుంటే సీఎం మాత్రం భీమ్లానాయక్ పై కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉన్నారు. తప్పులను ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుందన్నారు. భీమ్లానాయక్ విషయంలో వేధింపులు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.













