రాజ్యసభలో ఇక టీడీపీకి నో ప్లేస్..! చరిత్రలో ఇదే తొలిసారి..!!
రాజకీయ పార్టీల లక్ష్యంగా చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కంచుకోవడం. సభల్లో మెజారిటీ సీట్లు సాధించినప్పుడే అధికారం దక్కుతుంది. మ్యాజిక్ మార్క్ తగ్గితే ప్రతిపక్షానికి పరిమితం అవుతుంది. అసలు ప్రాతినిధ్యమే లేకపోతే చట్టసభల్లో వాయిస్ వినిపించే అవకాశమే ఉండదు. ఇప్పుడు రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా ఇదే. రాజ్యసభలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. రాజ్యసభలో చోటు లేకుండా పోవడం 41 ఏళ్ల పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.
తెలుగుదేశం పార్టీ ఎన్నో సంచలనాలకు వేదిక. పార్టీ ఆవిర్భావమే ఒక సంచలనం. అనతికాలంలోనే అది లోక్ సభలో ప్రతిపక్ష పార్టీ స్థాయికి ఎదిగింది. అయితే అదే స్థాయిలో పతనాలను కూడా చవిచూసింది. ఎన్నో ఆటుపోట్లకు ఎదురొడ్డి పోరాడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓ వెలుగు వెలిగిన ఆ పార్టీ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కనుమరుగైపోయింది. ఏపీలో 2019లో పార్టీ ఓటమి తర్వాత బలహీనమవడం మొదలైంది. ఇప్పుడు ఏకంగా ఆ పార్టీకి రాజ్యసభలో ప్రాతినిధ్యమే కోల్పోయే స్థాయికి దిగజారిపోయింది.
ఇన్నాళ్లూ టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా కనకమేడల రవీంద్రకుమార్ పదవీకాలం ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీలో ప్రస్తుత బలాబలాలను బట్టి మూడు సీట్లూ అధికార వైసీపీకే దక్కుతాయి. దీంతో టీడీపీకి చోటు లేకుండా పోయింది. వాస్తవానికి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ మొదట భావించింది. ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ వీడడం, మరికొంతమంది అసంతృప్తితో ఉండడం ఆ పార్టీని టెంప్ట్ చేసింది. అయితే దాదాపు పాతిక మందిని కూడగట్టడం అంత ఈజీ కాదేమోనని చివరి నిమిషంలో వెనక్కు తగ్గింది.
రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే దాని ప్రభావం వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై పడుతుంది. అది తీరని నష్టం కలిగిస్తుంది. అందుకే ప్రయోగాల జోలికి వెళ్లకుండా రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోయినా పర్లేదనుకున్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. దీంతో తొలిసారి ఏపీ నుంచి మొత్తం 11 రాజ్యసభ స్థానాలూ వైసీపీ సొంతం కాబోతున్నాయి. టీడీపీకి ఒక్కరు కూడా రాజ్యసభలో లేకుండా పోవడంతో ఆ పార్టీ వాయిస్ వినిపించే అవకాశం లేకుండా పోయింది.













