Whos Next?: పోసాని తర్వాత వాళ్లిద్దరేనా..? టెన్షన్లో శ్రీరెడ్డి, వర్మ..!!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధికారంలో ఉన్నప్పుడు ఓ రేంజ్ లో రెచ్చిపోయిన వాళ్లంతా ఇప్పుడు కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma), పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali), శ్రీరెడ్డి (Sri Reddy) లాంటి వాళ్లు జగన్ కు అనుకూలంగా ప్రత్యర్థులపై నోరు పారేసుకున్నారు. అయితే ప్రభుత్వం మారడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. తప్పయిపోయింది క్షమించండంటూ వీడియోలు పోస్టు చేశారు. అయితే నాడు రెచ్చిపోయి, ఇప్పుడు సారీ చెప్తే సరిపోతుందా.. శిక్ష అనుభవించాల్సిందేనంటూ టీడీపీ (TDP), జనసేన (Janasena) కార్యకర్తలు పాత కేసులను తవ్వి తీశారు. ఇప్పుడు ఆ కేసులను సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఒక్కొక్కరినీ పిలుస్తున్నారు. దీంతో వాళ్లలో టెన్షన్ మొదలైంది.
చంద్రబాబు (Chandrababu), లోకేశ్ (Lokesh), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టార్గెట్ గా పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali) ఏ రేంజ్ లో మాట్లాడారో అందరికీ తెలుసు. ఇప్పటికీ ఆయన వీడియోలు సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతూనే ఉన్నాయి. అప్పుడు ఫిర్యాదులు చేసిన వైసీపీ (YCP) ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి రాగానే వీళ్లందరిపైనా మరిన్ని కేసులు నమోదయ్యాయి. దీంతో తాజాగా పోసానిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వాస్తవానికి కూటమి అధికారంలోకి రాగానే పోసాని పూర్తిగా ప్లేట్ ఫిరాయించేశారు. తాను తప్పు చేశానని, అలా మాట్లాడి ఉండకూడదని.. క్షమించాలని కోరారు. ఇక రాజకీయాల జోలికి పోనని చెప్పారు. అయినా కూటమి పెద్దలు వదల్లేదు.
ఇప్పటికే రామ్ గోపాల్ వర్మను (RGV) పోలీసులు విచారిస్తున్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాలెం పోలీసులు వర్మను ఇప్పటికే ఓ దఫా విచారించారు. రెండో దఫా విచారణకు నోటీసులు ఇస్తే ఇప్పట్లో రాలేనని బదులిచ్చారు. ఇంతలో రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పొందారు. దీంతో పోలీసులు తొందర పడట్లేదు. ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే త్వరలోనే రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటూ ఉండడాన్ని కోర్టుకు దృష్టికి తీసుకెళ్ళాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు వర్మపై పలు జిల్లాల్లో నమోదైన కేసుల్లో కూడా అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది.
ఇక శ్రీరెడ్డి కూడా అరెస్టు కావడం ఖాయమనేది అమరావతి వర్గాల సమాచారం. జగన్ (YS Jagan) అధికారంలో ఉన్నప్పుడు శ్రీరెడ్డి తనదైన శైలిలో వ్యంగ్య వీడియోలతో రెచ్చిపోయేది. జగన్ ఓడిపోగానే పూర్తిగా సంప్రదాయినిగా మారిపోయింది. తప్పయిపోయిందంటూ పేరుపేరునా అందరికీ సారీ చెప్పింది. తన స్నేహితులంతా కమ్మోళ్లేనని కులం కార్డ్ కూడా ఉపయోగించింది. మరోవైపు మహిళ కావడం శ్రీరెడ్డి విషయంలో తొందరపడొద్దని చంద్రబాబు చేసిన హెచ్చరికలు కూడా ఆమె వైపు చూడకుండా చేశాయి. అయితే ఇప్పుడు శ్రీరెడ్డి మళ్లీ వీడియోలు పోస్టు చేయడం మొదలు పెట్టింది. దీంతో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంతో ఉన్నారు. అందుకే శ్రీరెడ్డిని కూడా ఓసారి పోలీస్ స్టేషన్ రుచి చూపించాలనే డిమాండ్లు మొదలయ్యాయి. అందుకే ఆమెను కూడా త్వరలోనే విచారణకు పిలవడమో, అరెస్టు చేయడమో ఖాయమని తెలుస్తోంది.













