రాజ్ ఘాట్ వద్ద టీడీపీ ఎంపీల మౌన దీక్ష
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు విభజన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్న ఎంపీలు ఇప్పుడు పోరును మరింత తీవ్రతరం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని సృష్టం చేశారు. విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం ప్రత్యేక వ్యూహాలతో ఉద్యమ వేడిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు ముగిసినా టీడీపీ ఎంపీలు ఢిల్లీలోనే ఉండి పోరాటం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. దీంతో ప్రత్యేక హోదా పోరు మరింత ఉధృతం చేశారు. ఈ రోజు ఉదయం రాజ్‌ఘాట్ వద్ద టీడీపీ ఎంపీలు మౌన దీక్షకు దిగారు. ఎంపీ తోట నర్సింహం నివాసంలో సమావేశమైన ఎంపీలు అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో రాజ్‌ఘాట్‌కు వెళ్లారు. అక్కడ మహాత్మగాంధీ సమాధికి నివాళులర్పించి శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు.













