ఇది ఏపీకి మాత్రమే కాదు.. ప్రధానికి కూడా
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లేకుండానే కేంద్ర హోంశాఖ భారత చిత్రపటం విడుదల చేయటంపై లోక్సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ మండిపడ్డారు. ఇది రాష్ట్ర ప్రజలను అవమానించడమేనన్న ఆయన…తక్షణం కేంద్రం తప్పును సరిదిద్దాలని కోరారు. కేంద్ర హోంశాఖ ఇటీవలే భారత చిత్రపటం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలేని ఆ చిత్రపటం చూసి మేం ఆశ్చర్యానికి గురయ్యాం. ఇది ఏపీ ప్రజలను అవమానించడమే కాదు.. రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధానిని కూడా అవమానించడమే. ఈ చిత్రపటం నూతన రాష్ట్రంలో పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. కేంద్రం తక్షణం ఈ తప్పును సరిదిద్ది నూతన చిత్రపటం విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా అని జయదేవ్ కోరారు.













