ఎంపీ సీఎం రమేష్ ఆమరణ దీక్ష ప్రారంభం
కడప స్టీల్ ఫ్యాక్టరీ సాధన కోసం తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్ ఆమరణ దీక్షకు దిగారు. బుధవారం ఉదయం జడ్పీ కార్యాలయం ఆవరణలో రమేష్ దీక్షను ప్రారంభించారు. ఎంపీ సీఎం రమేష్తో పాటు ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆమరణదీక్షకు దిగారు. ముందుగా గాంధీ, ఎన్టీఆర్ విగ్రహాలకు సీఎం రమేష్ పూలమాల వేసి దీక్ష ప్రారంభించారు. సీఎం రమేష్ దీక్షకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సంఘీభావం తెలిపారు. అంతకుముందు పోట్లదుర్తి నుంచి భారీ ర్యాలీతో కడప దీక్ష శిబిరానికి సీఎం రమేష్ చేరుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం స్థాపించేవరకూ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తానని సృష్టం చేశారు. ఉక్కు పరిశ్రమ రాకుండా కేంద్రం అడ్డుపడుతోందని మండిపడ్డారు. జిల్లాలో పరిశ్రమ సాధ్యం కాదని సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసినా, ప్రతిపక్ష నేత జగన్ ఒక్కమాట మాట్లాడకపోవడం విచారకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పినా కేంద్రం ముందుకు రాలేదని మండిపడ్డారు. గనులు కేటాయించిన రెండేళ్లలో కార్యకలాపాలు ప్రారంభం కాకుంటే గనులు రద్దయినట్లే అని, ఈ విషయం కేంద్రానికి తెలియదా అని ప్రశ్నించారు. స్టీల్ ఫ్యాక్టరీ కోసం పార్లమెంట్లోనూ పోరాడుతున్నామని తెలిపారు.













